- అందరూ గంజాయి
- తీసుకున్నట్టుగా నిర్ధారణ
- ఎక్కడి నుంచి తెస్తున్నారని పోలీసుల ఆరా
- కేసులు నమోదు.. డాక్టర్లతో కౌన్సెలింగ్
బషీర్‌బాగ్, వెలుగు: ఇప్పటికే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీసులు తాజాగా ఒక వినూత్న ప్రయోగం చేశారు. ఎవరైనా రౌడీషీటర్లు డ్రగ్స్వాడుతున్నారా? అన్నది తెలుసుకోవడానికి ఏకంగా వందల మందిని నగరంలోని మూడు ప్రధాన హాస్పిటల్స్‌కు తరలించి శుక్రవారం డ్రగ్స్టెస్టులు చేయించారు. దీంతో వీరిలో ఏకంగా 79 శాతం మంది డ్రగ్స్వాడుతున్నట్టు తేలింది. అది కూడా ఎక్కువ శాతం గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారు ఎక్కడి నుంచి డ్రగ్స్తీసుకువస్తున్నారు? ఎప్పటి నుంచి వాడుతున్నారు? దందా కూడా చేస్తున్నారా? అన్న విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. గంజాయి వాడుతున్నందుకు వారిపై కేసులు కూడా నమోదు చేశారు. అక్కడే అందరికీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు.
టాస్క్‌ఫోర్స్, హెచ్‌న్యూ ఆధ్వర్యంలో..
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) సంయుక్తంగా స్థానిక పోలీసుల సమన్వయంతో రౌడీ షీటర్లు, గొడవలకు దిగే వ్యక్తులు, గతంలో ఎన్‌డీపీఎస్ కేసుల్లో పట్టుబడిన డ్రగ్స్వాడకందారులకు ఆకస్మిక డ్రగ్ టెస్టులు నిర్వహించారు. స్పెషల్టీమ్స్ఏర్పాటు చేసి ఉస్మానియా, గాంధీ, ఎర్రగడ్డ ఆస్పత్రిలో 239 మందికి డ్రగ్స్కిట్స్తో టెస్టులు జరిపారు. గాంధీ హాస్పిటల్‌లో 70 మందికి పరీక్షలు చేయగా, 44 మందికి పాజిటివ్ వచ్చింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో 80 మందికి టెస్ట్చేయగా, 59 మందికి పాజిటివ్ గా తేలింది. ఎర్రగడ్డలో 89 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 86 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తంగా 239 మందికి పరీక్షలు చేయగా, 189 మంది డ్రగ్స్తీసుకున్నట్టు గుర్తించారు. అందరూ గంజాయి తీసుకున్నట్టు నిర్ధారణ అయిందని.. కొకైన్, ఎండీఎంఏ లాంటి డ్రగ్స్వాడినట్టు మాత్రం తేలలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
అక్కడికక్కడే కౌన్సిలింగ్
డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి డాక్టర్లు కౌన్సిలింగ్ఇచ్చారు. అలాగే, వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, హెచ్-న్యూ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు. ఎక్కువగా అడిక్ట్అయిన వారిని రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించనున్నట్టు చెప్పారు. అక్కడ వారికి 15 రోజులపాటు ప్రత్యేక పునరావాస కార్యక్రమాలు, బిహేవియరల్ కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ స్పెషల్ ఆపరేషన్ లో చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్డీసీపీ అందె శ్రీనివాస్, రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ పాల్గొన్నారు.
