మణిపూర్‌లో మళ్లీ మంటలు..దుండగుల బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి

మణిపూర్‌లో మళ్లీ మంటలు..దుండగుల బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి
  • దుండగుల బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి
  • కోపంతో రెండు ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కును తగులబెట్టిన బిష్ణుపూర్ ప్రజలు
  • ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపివేత, కర్ఫ్యూ అమలు

ఇంఫాల్: మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం బిష్ణుపూర్ జిల్లాలోని త్రోంగ్లాబీ అవాంగ్ లైకై గ్రామంలో ఒక ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. ఆ సమయంలో ఇంట్లో గాఢనిద్రలో ఉన్న ఐదేండ్ల బాలుడు, ఆరు నెలల పాప అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారుల తల్లి ఓయినమ్ బినిత తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాంబు దాడి వార్త తెలియగానే బిష్ణుపూర్ జిల్లా ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. చురాచాంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ వైపు వెళ్తున్న రెండు ఆయిల్ ట్యాంకర్లు, ఒక భారీ ట్రక్కును తగులబెట్టారు. మొయిరాంగ్ పోలీస్ స్టేషన్ బయట టైర్లను తగులబెట్టి, బారికేడ్లను ధ్వంసం చేశారు. వేలాది మంది నిరసనకారులు బిష్ణుపూర్, చురాచాంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ సరిహద్దులోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో భద్రతా దళాలు నిరసనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపాయి. ఈ ఘర్షణల్లో 19 మందికి గాయాలు కాగా, ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం.

ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్.. కర్ఫ్యూ విధింపు

శాంతిభద్రతలను కాపాడేందుకు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మణిపూర్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, థౌబల్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో మూడు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాంబు దాడి జరిగిన బిష్ణుపూర్ జిల్లాలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.