- సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి తుమ్మల
ఖమ్మం, వెలుగు : నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ నిర్మాణం కోసం ధంసలాపురం రెవెన్యూ పరిధిలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, తిరుమల దర్శనానికి వెళ్లలేని భక్తులకు స్థానికంగా టీటీడీ దేవాలయం ఏర్పడితే ఆధ్యాత్మిక అవసరాలు నెరవేరుతాయని ఆయన వివరించారు.
దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, వెంటనే రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ధంసలాపురం పరిధిలో కేటాయించిన 20 ఎకరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణంతోపాటు యాత్రికుల కోసం వసతి గృహాలు, కల్యాణ మండపం, పార్కింగ్ సౌకర్యాలు, ధార్మిక కార్యకలాపాల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.
