భారత స్టాక్ మార్కెట్లలో రక్తపాతం ఈవారం మెుత్తం కొనసాగిందని చెప్పుకోవచ్చు. మంగళవారం మినహా మిగిలిన అన్ని ట్రేడింగ్ దినాల్లో నమోదైన భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు దాదాపు రూ.20 లక్షల కోట్ల వరకూ నష్టం జరిగింది. చాలా మంది ఇన్వెస్టర్లు తమ పోర్ట్ ఫోలియోలో పెట్టుబడి 30 శాతం నుంచి 70 శాతం మధ్య ఆవిరైందని వాపోతున్నారు. మరికొందరు తమ పూర్తి పెట్టుబడి సొమ్ము నెగటివ్ రిటర్న్స్ లోకి జారుకున్నాయని.. ఏం చేయాలో పాలుపోవటం లేదంటూ అయోమయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవాళ ఇంట్రాడేలో 3.07 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1540 పాయింట్ల వరకూ దిగజారింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 500 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 1340 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1570 పాయింట్లు తగ్గిపోయాయి. ఏ షేరు కొన్నా నష్టాలు రాకుండా ఉంటాయ్ అనే గ్యారెంటీ లేదు అంటూ పెట్టుబడిదారులు వాపోతున్నారు. ప్రధానంగా గ్యాస్ షార్టేజీని పూడ్చేందుకు కేంద్రం ఉత్పత్తిని పెంచాలని ఆదేశించటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి రిఫైనరీలు, అదానీ టోటల్ గ్యాస్ లాంటి సంస్థల షేర్లకు మాత్రం నష్టాల మార్కెట్లోనూ రెక్కలు వచ్చాయి. ఇక మరోపక్క ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ పొయ్యిలు తయారు చేసి అమ్మే సంస్థల షేర్లు కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. ఇవి మినహా దాదాపుగా మిగిలిన రంగాల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇవాళ ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్ రంగాలకు చెందిన స్టాక్స్ భారీగా నష్టాలను మూటకట్టుకున్నాయి. మరోపక్క యూఎస్ ఫెడ్ పాలసీపై అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి పతనం, క్రూడ్ దిగుమతులపై కొనసాగుతున్న అనిశ్చితి వెరసి మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే 13 రోజుల యుద్ధం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మెుత్తాన్ని కుదిపేస్తోంది. ఆధునిక యుగంలో ఒక దేశంపై మరో దేశం ఎంతలా ఆధాపడి జీవిస్తున్నాయో ఈ రెండు వారాల యుద్ధం కళ్లకు కడుతోంది.
మరోపక్క దేశంలోని ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు కూడా త్వరలోనే తమ ఉత్పత్తుల రేట్లను పెంచటం లేదా రేటుకు అనుగుణంగా వస్తువుల బరువును తగ్గించటంపై ఫోకస్ పెట్టాయి. గల్ఫ్ దేశాల నుంచి ఫ్యాకేజింగ్ మేటీరియల్, కెమికల్స్ నిలిచిపోవటంతో చైనా లాంటి దేశాలవైపు చూస్తున్నాయి. దీంతో ఇవాళ ఇంట్రాడేలో ఈ రంగంలోని టాటా కన్జూమర్, హిందుస్థాన్ యూనీలివర్ స్టాక్స్ భారీగానే లాభపడ్డాయి.
