వాటర్ బోర్డు పానీ యాప్తో పైసలు... అక్రమ కనెక్షన్ లు, నీటి వృథాను ఫొటో తీసి పంపితే రూ. 200 బహుమతి

వాటర్ బోర్డు పానీ యాప్తో పైసలు... అక్రమ కనెక్షన్ లు, నీటి వృథాను ఫొటో తీసి పంపితే రూ. 200 బహుమతి
  • మార్చి 1 నుంచి అందుబాటులోకి కొత్త యాప్
  • నీటి వృథాను అరికట్టేందుకు వినూత్న నిర్ణయం

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​లో తాగునీటి అక్రమ కనెక్షన్​లు, నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు మెట్రో వాటర్ బోర్డు వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రజలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ మార్చి 1 నుంచి ‘పానీ యాప్’ను అందుబాటులోకి తీసుకురానుంది. నగరంలో సరఫరా అవుతున్న నీటిలో సుమారు 30 శాతం అక్రమ కనెక్షన్లు, మోటార్ల వాడకం వల్ల లెక్కలోకి రాకపోవడంతో బోర్డు ఈ చర్యలకు తీసుకుంటోంది. 

ఎవరైనా నీటిని వృథా చేస్తున్నా లేదా అక్రమ కనెక్షన్​లు, నల్లాలకు మోటార్లు బిగించి అక్రమంగా వాడుతున్నా.. ప్రజలు ఆ దృశ్యాలను ఫొటో తీసి ఈ యాప్​లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తే జీఐఎస్ ద్వారా సదరు కనెక్షన్ దారుడిని గుర్తించి రూ. 5 వేల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో కనెక్షన్ కట్ చేస్తారు. 

సమాచారం అందించిన వ్యక్తికి ప్రతి ఫొటోకు రూ. 200 రివార్డు అందజేయడంతో పాటు వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, వృథాను అరికట్టి అందరికీ తాగునీరు అందేలా చూడటమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశమన్నారు.