హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నాటికి 37,400 ఇందిరమ్మ ఇండ్లకు స్లాబులు పడ్డాయని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ వారంలో వివిధ స్టేజ్లలో ఇండ్లు నిర్మించుకున్న 18,247 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.202.93 కోట్ల బిల్లులు జమ చేశామని ఆయన పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రతీ వారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారంలో 4,615 మంది లబ్ధిదారులు బేస్ మెంట్ లెవల్ వరకు, 8,517 మంది రూఫ్ లెవల్ (గోడలు పూర్తి) వరకు నిర్మాణాలు చేసుకోగా.. 5,115 మంది స్లాబ్ వేశారని ఆయన తెలిపారు. వారికి వారి బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసినట్టు ఎండీ గౌతమ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మొత్తం 2,900 కోట్ల బిల్లుల చెల్లింపు
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం రూ.2,900.35 కోట్ల బిల్లులు విడుదల చేసినట్టు హౌసింగ్ ఎండీ గౌతమ్ తెలిపారు. వీటిలో బేస్ మెంట్ లెవల్ (బీఎల్) దాటిన ఇండ్లకు రూ.1,610.79 కోట్లు, రూఫ్ లెవల్ (ఆర్ ఎల్) వరకు ఇండ్లు నిర్మించుకున్న వారికి రూ.716.91 కోట్లు, రూఫ్ క్యాస్టెడ్ (శ్లాబ్ పూర్తి –ఆర్ సీ)- అయిన ఇండ్లకు రూ.572.65 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
