భద్రాచలం, వెలుగు: జార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం డీజీపీ తదాషామిశ్రా సమక్షంలో 24 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఆపరేషన్ నవజీవన్ పేరిట జార్ఖండ్ ప్రభుత్వం నక్సల్స్ ఆపరేషన్ చేపట్టింది. సరెండర్ అయిన మావోయిస్టుల్లో 8 మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.
జార్ఖండ్ మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు రీజనల్ కమిటీ మెంబర్ సంతోష్ అలియాస్ బాసుదేవ్ అలియాస్ గాంధీపై రూ.15లక్షల రివార్డు, జోనల్ కమిటీ సభ్యుడు చందన్ లోహాపై రూ.10 లక్షల రివార్డు, సబ్ జోనల్ కమిటీ సభ్యులు అనిల్ తురీ, సుఖ్లాల్బిరింజియాపై రూ.5లక్షల రివార్డు, ఏరియా కమిటీ సభ్యులు సుదేశ్హోన్హోగా, రిసివ్ బుధ్ సోయాపై రూ.2లక్షల రివార్డు ఉంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 8 మంది మావోయిస్టుల్లో జోనల్ కమిటీ సభ్యుడు అశ్విన్, సబ్ జోనల్ కమిటీ సభ్యులు పూనెం సోహన్, రాహత్ మాండవి, ఏరియా కమిటీ సభ్యులు రీతా, అనూషా, రజనీ ఉన్నారు. సరెండర్ అయిన మావోయిస్టుల నుంచి 6 ఇన్సాస్ రైఫిల్స్, 2 ఏకె-47లు, ఒక హెచ్‌కే -33 రైఫిల్, ఒక యూఎస్ కార్బన్, 11 ఎం-16 రైఫిల్స్ వంటి అధునాతన ఆయుధాలు, 38 మ్యాగజైన్లు, 1,562 లైవ్ తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టుల డంప్ స్వాధీనం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో మంగళవారం ఐటీబీపీ, డీఆర్జీ, లోకల్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు చెందిన డంప్ లభ్యమైంది. ఓర్చా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆడింగ్పార్ క్యాంప్ నుంచి తనిఖీలు చేపట్టారు.
కసోద్- కుమేరడి మార్గంలో డంప్ కనిపించింది. 297 లైవ్ తూటాలు దొరికాయి. 7.62 మిల్లీమీటర్ సైజ్ కలిగిన 195 తూటాలు, 102.5 మిల్లీమీటర్ సైజ్ ఉన్న 102 తూటాలు ఉన్నాయి. సరెండర్ అయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు అబూజ్మాఢ్ అడవులను భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి.
