ములుగు జిల్లాలో విషగులికలు తాగి అస్వస్థతకు గురైన కూలీలు

ములుగు జిల్లాలో విషగులికలు తాగి అస్వస్థతకు గురైన  కూలీలు

ములుగు జిల్లాలో వ్యవసాయ కూలీలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడేంలో విషగులికలు కలిపిన నీరు తాగి 25 మంది కూలీలు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం కూలీలందరినీ ట్రాక్టర్‌పై వెంకటాపురం ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు , సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించారు. 

ఏమైందంటే..

ఉప్పేడు గొల్లగూడేంలో మిర్చితోటలో మిరపకాయలు తెంపేందుకు 25 మంది కూలీలు వెళ్లారు. భోజనం విరామ సమయంలో సమీపంలోని మరో రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని పైపుల వద్ద నీటిని తాగారు. కొద్దిసేపటికి పలువురు కూలీలకు వాంతులయ్యాయి. నాలుక తిమ్మిరిగా ఉండటంతో పాటు.. కళ్లు తిరగడంతో ఆందోళన చెందారు.  అస్వస్థతకు గురైన కూలీలందరినీ ట్రాక్టర్‌పై వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కూలీలు చికిత్స పొందుతున్నారు. 

విషగులికలపై మిగిలిన కూలీలు ఆరాతీశారు. అయితే  రైతు తన పొలంలోని డ్రిప్‌ పైపులను శుభ్రపరిచేందుకు పాస్ఫరిక్‌ యాసిడ్‌ అనే రసాయన మందును ఉపయోగించినట్లు తేలింది.  ఆ పైపుల నుంచే విడిచిపెట్టిన నీటిని కూలీలు తాగడంతో.. అస్వస్థతకు గురయ్యారు.