గాంధీనగర్: కాబోయే భర్తతో గొడవ కావడంతో మనస్థాపానికి గురై ఓ ఫిజియోథెరపిస్ట్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లాల్సిన బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. జామ్‌నగర్ జిల్లాలోని మోతీ భేగ్డి గ్రామానికి చెందిన డాక్టర్ రాధిక జమాన్‌భాయ్ కోటడియా (28) తన కుటుంబంతో కలిసి సూరత్‌లోని శరతన ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె తండ్రి వజ్రాల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ అయిన రాధిక సారథనా-జకత్నాకలో సొంతంగా శ్రీజీ ఫిజియో క్లినిక్‌ను నడిపిస్తోంది. ఇటీవల రాధికకు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. 2026 జనవరిలో పెళ్లి జరగాల్సి ఉంది.
ఈ క్రమంలో కాబోయే భర్తతో రాధికకు మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాధిక 2025, నవంబర్ 21వ తేదీ సాయంత్రం శరతన ప్రాంతంలోని బిజినెస్ హబ్ భవనంలోని 9వ అంతస్తులో ఉన్న ఓ కేఫ్ కు వెళ్లింది. అక్కడ దాదాపు ఓ 20 నిమిషాలు ఫోన్ లో మాట్లాడింది. అనంతరం 9వ అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాధిక ఆత్మహత్యకు కారణమేంటనే దానిపై వివిధ కోణాల్లో ఆరా తీశారు. రాధిక ఫోన్ చాటింగ్ ఆధారంగా కాబోయే భర్తతో విభేదాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాధిక సూసైడ్ చేసుకున్న కేఫ్‌కు కూడా కాబోయే భర్తతో ఆమె తరుచుగా వెళ్లేదని పోలీసులు వెల్లడించారు. మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాల్సిన బిడ్డ క్షణికావేశంలో అర్థాంతరంగా తనువు చాలించడంతో రాధిక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
