లండన్: ఈసారి కూడా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఇండియాకు కలిసిరాలేదు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 444 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో టీమిండియా మళ్లీ తడబడింది. టాప్–3 బ్యాటర్లు ఫెయిల్ కావడంతో.. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 164/3 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్), అజింక్యా రహానె (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో రోహిత్‌సేన నెగ్గాలంటే ఇంకా 280 రన్స్ చేయాలి. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే డ్రాతో బయటపడటం దాదాపుగా అసాధ్యం. ఇప్పటి వరకు ఓవల్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు 263. ఒకవేళ ఇండియా 444 రన్స్ ఛేజ్ చేస్తే మాత్రం టెస్ట్ హిస్టరీలోనే అతిపెద్ద రికార్డును సొంతం చేసుకుంటుంది.
క్యారీ, స్టార్క్ ఓకే..
అంతకుముందు 123/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 84.3 ఓవర్లలో 270/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అలెక్స్ క్యారీ (66 నాటౌట్), మిచెల్ స్టార్క్ (41) మెరుగ్గా ఆడారు. మార్నింగ్ సెషన్‌లో ఉమేశ్ (2/54), షమీ (2/39) రివర్స్ స్వింగ్‌తో ఇబ్బందిపెట్టారు. డే థర్డ్ ఓవర్‌లోనే లబుషేన్ (41)ను ఔట్ చేసి పట్టు సాధించారు. కానీ క్యారీ ఒంటరి పోరాటంతో ఆసీస్‌ను నిలబెట్టాడు. లంచ్‌కు కొద్దిగా ముందు జడేజా (3/58).. గ్రీన్ (25)ను ఔట్ చేసి ఆరో వికెట్‌కు 43 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఈ దశలో వచ్చిన స్టార్క్... క్యారీకి అండగా నిలిచాడు. ఈ ఇద్దరు నిలకడగా ఆడటంతో తొలి సెషన్‌లో 26 ఓవర్లలో 78 రన్స్ వచ్చాయి. ఫలితంగా ఆసీస్ 201/6తో లంచ్‌కు వెళ్లింది. లంచ్ తర్వాత కూడా క్యారీ, స్టార్క్ ఇండియా బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఆఖర్లో వరుస ఓవర్లలో షమీ.. స్టార్క్, కమిన్స్‌ను ఔట్ చేయడంతో సెషన్ మధ్యలోనే ఆసీస్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. స్టార్క్, క్యారీ ఏడో వికెట్‌కు 93 రన్స్ జత చేశారు.
గిల్ ఔటా.. నాటౌటా!
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఇండియాకు ఏదీ కలిసి రాలేదు. రెండు వైపుల నుంచి ఆసీస్ పేసర్లు ఎదురుదాడి చేయడంతో గిల్ (18) బాగా ఇబ్బందిపడ్డాడు. రోహిత్ (43) ధైర్యం చేసి షాట్లు కొట్టడంతో స్కోరు ముందుకు సాగింది. అయితే 8వ ఓవర్‌లో బొలాండ్ (1/38) వేసిన ఎక్స్‌ట్రా బౌన్స్ బాల్‌ను గిల్ షాట్ ఆడాడు. కానీ గ్రౌండ్‌కు కొన్ని ఇంచ్‌ల ఎత్తులో వచ్చిన బాల్‌ను గ్రీన్ ఎడమవైపు డైవ్ చేస్తూ అందుకున్నాడు. మామూలుగా చూస్తే బాల్ కింద తగిలినట్లు కనిపించింది.
దాదాపు 15 నిమిషాల పాటు రీప్లేలు చూసిన టీవీ అంపైర్ చివరకు ఔటివ్వడంతో గ్రౌండ్‌లోని ఫ్యాన్స్ ‘చీట్ చీట్’ అంటూ ఆసీస్‌ను గేలి చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో గ్రీన్ అందుకున్న రహానె క్యాచ్ కూడా ఇలాగే అనుమానాలకు దారి తీసింది. ఇక పుజారా (27)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే 20వ ఓవర్‌లో లైయన్ (1/32).. రోహిత్‌ను ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 51 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. సరిగ్గా ఐదు బాల్స్ తర్వాత పుజారాను కమిన్స్ (1/42) పెవిలియన్‌కు పంపడంతో ఇండియా ఒక్క రన్ తేడాతో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ, రహానె నాలుగో వికెట్‌కు ఇప్పటి వరకు 71 రన్స్ జోడించారు.
