
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఆదివారం (ఆగస్ట్ 17) తెల్లవారుజూమున న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్లో దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు. ఘటన స్థలంలో పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.
మృతుల్లో ఇద్దరు పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అనుమానితులను ఇంకా గుర్తించలేదని వెల్లడించారు. ఘటన స్థలం నుంచి 36 షెల్ కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 903 ఫ్రాంక్లిన్ అవెన్యూలోని టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్ లోపల ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని న్యూయార్క్ కమిషనర్ జెస్సికా టిష్ వెల్లడించారు.