రాజ్యసభకు దాఖలైన 3 నామినేషన్లు తిరస్కరణ

రాజ్యసభకు దాఖలైన 3 నామినేషన్లు తిరస్కరణ
  •  సీఈఓ వికాస్  రాజ్  వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఎన్నికలకు దాఖలైన మూడు నామినేషన్లను తిరస్కరించామని సీఈఓ వికాస్​ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం నుంచి ఏప్రిల్​2న మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా ఆ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ జారీ చేసింది. నామినేషన్లను దాఖలు చేసే గడువు గురువారంతో ముగిసింది. రిటర్నింగ్​ ఆఫీసర్, అసెంబ్లీ జాయింట్​ సెక్రటరీ ఉపేందర్​ రెడ్డి శుక్రవారం నామినేషన్​లను పరిశీలించారు. ఒక్కో సెట్​నామినేషన్​ను ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. 

శ్రమజీవి పార్టీ అభ్యర్థులు కోయల్కర్​ భోజ్​ రాజ్, జాజుల భాస్కర్, ఇండిపెండెంట్​అభ్యర్థి కిరణ్​ రాథోడ్​ల నామినేషన్లను ప్రతిపాదిస్తూ ఒక్క ఎమ్మెల్యే కూడా సంతకం చేయలేదు. దీంతో ఆ ముగ్గురి నామినేషన్లను తిరస్కరించారు. కాంగ్రెస్​ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్​ కుమార్  యాదవ్, బీఆర్ఎస్ ​అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 20న ముగియనుంది.