- రూ.23, 437 కోట్లతో సుమారు 901 కిలో మీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్ పెంపు
- కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
- సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 37 కు పెంపు
- గుజరాత్‌కు రెండు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు
- ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ కింద రూ. 5,659.22 కోట్లు
- ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కోసం రూ.18,100 కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణసహా 6 రాష్ట్రాలను కవర్ చేసేలా మూడు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ. 23, 437 కోట్లతో సుమారు 901 కిలో మీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్ పెంచాలని నిర్ణయించింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగ్దా– మధుర, గుంతకల్ –వాడి, బుర్వాల్–సీతాపూర్ లైన్లను 3 లైన్ల నుంచి 4 లైన్లకు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ, మధ్యప్రదేశ్, యూపీ, కర్నాటక, ఏపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 19 జిల్లాలను కవర్ చేయనున్నాయి.
అలాగే, ఈ ప్రతిపాదిత మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దాదాపు 83 లక్షల జనాభా కలిగిన 4, 161 గ్రామాలకు అనుసంధానం చేయనున్నాయి. అలాగే, దేశంలోని మహాకాళేశ్వరం, రణతంబోర్ నేషనల్ పార్క్, కునో నేషనల్ పార్క్, కియోలాడియో నేషనల్ పార్క్, మధు, బృందావన్, మంత్రాలయ(శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠం), నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం, శ్యామ్ రామ్, ఇతర అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచనున్నాయి. వీటితో పాటు బొగ్గు, ఆహార ధాన్యాలు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు(పీఓఎల్), ఇనుము, ఉక్కు, కంటైనర్లు, ఎరువులు, మొదలైన వస్తువుల అదనపు రవాణాకు మార్గం సుగుమం కానుందని కేంద్రం
వెల్లడించింది.
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 37కు పెంపు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ను 37కు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. సుప్రీకోర్టు (న్యాయూర్తుల సంఖ్య) సవరణ బిల్లు – 2026 ను పార్లమెంట్‌లో పెట్టే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కాకుండా ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 34 –37 (కొత్తగా నలుగురు జడ్జీలు) పెంచడానికి వీలుకలుగుతుంది. న్యాయమూర్తుల సంఖ్య పెంపుతో సుప్రీంకోర్టు మరింత సమర్థవంతంగా, వేగవంతమైన న్యాయం అందించడానికి దోహదపడుతుందని కేంద్రం పేర్కొంది.
ఈ నలుగురు జడ్జీలు, సహాయక సిబ్బంది జీతాలు, ఇతర సౌకర్యాలకు అయ్యే ఖర్చును భారత సంఘటిత నిధి నుంచి కేటాయించనున్నారు. కాగా.. సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) 1960 చట్ట ప్రకారం.. జడ్జీల గరిష్ట సంఖ్యను 10 గా నిర్ణయించారు. అనంతరం1960 చట్ట సవరణతో జడ్జీల సంఖ్యను 13 కి, 1977 సవరణతో 17 కి పెంచారు. అయితే సీజేఐ మినహాయించి.. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను కేంద్ర కేబినెట్ 1979 చివరల్లో 15కు పరిమితం చేసింది. ఆ తర్వాత సీజేఐ అభ్యర్థన మేరకు ఈ పరిమితిని తొలగించారు. 1986 సవరణతో జడ్జీల సంఖ్యను 17 నుంచి 25 కు పెంచారు. 2008లో చేసిన చట్ట సవరణతో 25 నుంచి 30, చివరగా 2019 లో జరిగిన సరవణతో 33 కు పెంచారు.
రూ.3,936 కోట్లతో రెండు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు
గుజరాత్‌కు రెండు సెమీకండక్టర్ ప్రాజెక్టులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద వీటికి ఆమోదం తెలిపింది. వీటిలో జీఏఎన్ (గాలియం నైట్రైడ్) టెక్నాలజీ ఆధారిత దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య మినీ/మైక్రో-ఎల్ఈడీ డిస్‌ప్లే కేంద్రం, ఒక సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కేంద్రం ఉన్నాయి. ఆమోదం పొందిన 2 ప్రతిపాదనలతో గుజరాత్‌లో సుమారు రూ.3,936 కోట్ల మొత్తం పెట్టుబడితో సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
వీటితో 2,230 మంది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. క్రిస్టల్ మ్యాట్రిక్స్ లిమిటెడ్.. సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు కోసం ఈ సంస్థకు రూ. 3,068 కోట్లు కేటాయించారు. సుచి సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్.. మరో యూనిట్ కోసం రూ.868 కోట్లు మంజూరు చేశారు. 2026–-27 సీజన్‌కు చెరుకు రైతులకు క్వింటాల్‌కు రూ.365 చొప్పున ‘న్యాయమైన, లాభదాయకమైన ధర’ను మంత్రివర్గం ఆమోదించింది. చెరుకు ‘ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్’ (ఎఫ్‌ఆర్‌పీ) కోసం ఏకంగా రూ. లక్ష కోట్లను కేటాయించింది. పత్తి ఉత్పాదకతను పెంచేందుకు రూ. 5,659.22 కోట్లు మంజూరు చేసింది. ఎంఎస్ఎంఈలకు మద్దతునిచ్చేలా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) కోసం రూ. 18,100 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. గుజరాత్‌లో ఓడల మరమ్మత్తుల అభివృద్ధికి రూ. 1,570 కోట్లు కేటాయించింది.
