V6 News

భారత్, రష్యా మధ్య ‘రెలోస్’ ఒప్పందం అమల్లోకి.. ఆర్మీ స్థావరాలు, పోర్టులు, ఎయిర్ బేస్ ల ఎక్స్ చేంజ్

భారత్, రష్యా మధ్య ‘రెలోస్’ ఒప్పందం అమల్లోకి.. ఆర్మీ స్థావరాలు, పోర్టులు, ఎయిర్ బేస్ ల ఎక్స్ చేంజ్
  • యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు నిలుపుకొనేందుకూ అగ్రిమెంట్

న్యూఢిల్లీ: భారత్, రష్యా మధ్య ‘ఇండో రష్యన్  రెసిప్రోకల్ ఎక్చేంజ్ ఆఫ్​ లాజిస్టిక్స్  అగ్రిమెంట్’(రెలోస్) అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం కింద ఇరు దేశాలు తమ ఆర్మీ స్థావరాలు, పోర్టులు, ఎయిర్ బేస్ లను షేర్  చేసుకుంటాయి. అలాగే, ఒకరి భూభాగంలో మరొకరు 3 వేల వరకు మిలిటరీ సిబ్బంది, 5 యుద్ధ నౌకలు, 10 ఫైటర్  జెట్లను తరలించవచ్చు. నిరుడు ఫిబ్రవరిలో భారత్, రష్యా మధ్య మాస్కోలో ఈ ఒప్పందం కుదరగా తాజాగా ఇది అమల్లోకి వచ్చింది. 

ఇరు దేశాల మధ్య మిలటరీ సహకారం, లాజిస్టిక్స్  సపోర్టు పెంపొందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐదేండ్ల పాటు అమల్లో ఉండే ఈ అగ్రిమెంట్ ను అవసరాన్ని బట్టి పొడిగించవచ్చని రష్యా న్యూస్  ఏజెన్సీ స్పుత్నిక్  తెలిపింది. ఈ ఒప్పందంతో భారత స్ట్రాటజిక్ పరిధి ఆర్కిటిక్  ప్రాంతం వరకు విస్తరించినట్లైందని పేర్కొంది. అలాగే, రష్యాలోని ముర్మాన్స్క్, సెవెరోమార్స్క్ పోర్టుల్లోకి భారత నౌకలకు ప్రవేశం లభిస్తుందని వెల్లడించింది.

ఒప్పందంతో ఇరు దేశాలకు డబ్బు, సమయం ఆదా

హిందూ మహాసముద్రంలో భారత నేవీ నుంచి లాజిస్టిక్స్  సపోర్టు పొందాలని రష్యా కోరుకుంటోంది. రెలోస్  ఒప్పందం అమల్లోకి రావడంతో రష్యాకు రీఫ్యూయెలింగ్, రిపేర్, స్పేర్ పార్టుల సప్లై వంటివి లభించనున్నాయి. అలాగే భారత్ కూ రష్యా అదేవిధంగా సపోర్టు చేస్తుంది. యుద్ధాలులేని సమయంలో (పీస్ టైమ్) కూడా ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. 

అమెరికాతోనూ భారత్ ఇలాగే ఒప్పందం కుదుర్చుకొంది. లాజిస్టిక్స్ ఎక్చేంజ్ మెమొరాండం ఆఫ్  అగ్రిమెంట్ (లెమొవా) పేరుతో అమెరికా, భారత్  మధ్య ఈ అగ్రిమెంట్  కుదిరింది. ఈ ఒప్పందం కింద ఇరు దేశాలు రీఫ్యూయెలింగ్, సప్లయ్స్, లాజిస్టిక్స్  సపోర్టు ఇచ్చిపుచ్చుకుంటాయి.