ఖమ్మం జిల్లాలో గిరి జనుల కుటుంబాల్లో వెలుగులు

ఖమ్మం జిల్లాలో  గిరి జనుల కుటుంబాల్లో  వెలుగులు
  •     డీఏ జగ్వా స్కీంతో జిల్లాలో 3,159 మందికి లబ్ధి  
  •     ఏజెన్సీలోని గిరిజనుల ఇండ్లకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్స్​
  •     మీటర్, స్విచ్ బోర్డు, ప్లగ్ పాయింట్​ అన్నీ ఉచితమే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గిరిజన కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ధర్తీ ఆబా జన్​ జాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ (DAJGUA) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో జిల్లాలో 3,159 మంది గిరిజనుల ఇండ్లకు విద్యుత్​సరఫరా చేయనున్నారు.  

రూ.15.87 కోట్లతో పనులు..

జిల్లాలో రూ.15.87 కోట్లతో ఏజెన్సీలోని ప్రతి ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా కరెంట్ లేని గిరిజనుల ఇండ్లను ఆఫీసర్లు గుర్తించారు. ఇంట్లో బల్బు వెలిగేంతవరకు ఫ్రీగా విద్యుత్​పరికరాలు అమర్చే విధంగా ఆఫీసర్లు ప్లాన్​చేశారు. ఈ  స్కీం అమలుతో జిల్లాలోని 3,159 గిరిజనుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 

సర్వీస్​వైర్, మీటర్, ప్లగ్ పాయింట్, అడాప్టర్, హోల్డర్​తోపాటు స్విచ్​బోర్డులన్నీ ఫ్రీగానే ఇవ్వనున్నారు. మార్చి నెలాఖరులోపు ఈ స్కీంను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఆఫీసర్లు ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు గుర్తించిన 3,159 ఇండ్లకు 1,450 సర్వీసులకు సంబంధించి కరెంట్​లైన్లను రెడీ చేశామని డీఈ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.  

గిరిజనుల ఇండ్లకు ఫ్రీగా విద్యుత్​ కనెక్షన్లు..

జిల్లాలోని కరెంట్ లేని గిరిజనుల ఇండ్లకు ఫ్రీగా విద్యుత్​కనెక్షన్ ఇవ్వడంతోపాటు ఇంట్లోకి బల్బు వెలిగేంతవరకు అన్ని పనులు చేపడుతున్నాం. లబ్ధిదారుడు కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు​ఇస్తే సరిపోతుంది. ఇప్పటివరకు గుర్తించిన ఇండ్లకే కాకుండా కరెంట్ సప్లై లేని గిరిజనుల ఇండ్లు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే విద్యుత్ కనెక్షన్​ఫ్రీగా ఇస్తాం. - మహేందర్, ఎస్ఈ, ఎన్​పీడీసీఎల్, భద్రాద్రికొత్తగూడెం