మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు ఏడాదిగా డుమ్మా : డా. నరేంద్ర కుమార్

మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు ఏడాదిగా డుమ్మా :  డా. నరేంద్ర కుమార్
  • ‌‌32 మందికి డీఎంఈ షోకాజ్ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్‌లో ఏడాది కాలంగా డ్యూటీకి హాజరు కాని 32 మంది ప్రొఫెసర్లకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డా. నరేంద్ర కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

చాలా మంది నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే సంజాయిషీ లేకుండా సర్వీసు నుంచి పర్మనెంట్‌గా తొలగిస్తామని హెచ్చరించారు. 

షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో రిమ్స్ అదిలాబాద్‌కు చెందిన ఏడుగురు, భద్రాద్రి కొత్తగూడెం టీచింగ్ హాస్పిటల్ కు చెందిన ఇద్దరు, కామారెడ్డి జనరల్ హాస్పిటల్ కు చెందిన ఐదుగురు, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల నుంచి తొమ్మిది మంది చొప్పున ప్రొఫెసర్లు ఉన్నారు.