అమ్మో .. 32 వేల టన్నులే...! గణేష్ నవరాత్రుల్లో పేరుకుపోయిన చెత్త, విగ్రహాల వ్యర్థాలు

అమ్మో .. 32 వేల టన్నులే...! గణేష్ నవరాత్రుల్లో పేరుకుపోయిన చెత్త, విగ్రహాల వ్యర్థాలు
  • రోడ్లపై 20  వేల టన్నులు ఎత్తిన కార్మికులు
  • హుస్సేన్​సాగర్​లో 4,350  విగ్రహ వ్యర్థాలు బయటకు..
  • మరో 8 వేల టన్నులు ఉంటుందని అంచనా 
  • మరో రెండు రోజులపాటు శానిటేషన్ డ్రైవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నవరాత్రోత్సవాల్లో రోడ్లపై 20  వేల టన్నులు, హుస్సేన్​సాగర్​లో 12 వేల టన్నుల వినాయక విగ్రహ వ్యర్థాలు బయటపడ్డాయి. రోడ్లపై చెత్తను, ‘సాగర్’​లో  వ్యర్థాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది ఇంకా తొలగిస్తూనే ఉన్నారు. ఉత్సవాలు జరిగిన11 రోజులపాటు గ్రేటర్​రోడ్లపై భక్తులు 20 వేల టన్నులకు పైగా చెత్త వేయగా, క్లీన్​చేశామని బల్దియా అధికారులు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఒక్కరోజులోనే 4 వేల టన్నుల చెత్త బయటపడిందన్నారు. ఇండ్ల నుంచి వచ్చిన చెత్త ఏడు వేల టన్నులు దీనికి అదనం. 

రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు ఆయా డంపింగ్ యార్డులకు తరలించేందుకు 700 వాహనాలను వినియోగించామన్నారు. నిమజ్జనం జరిగిన హుస్సేన్​సాగర్​తీరప్రాంతాల్లో పేపర్ షాట్లను తొలగించేందుకు ప్రైవేటుకు చెందిన ఒక జటాయ్ యంత్రాన్ని వాడామని పేర్కొన్నారు. రోడ్డుపై నుంచి నేరుగా మెషీన్​లోపలకు చెత్తను తీసుకోవడమే దీని ప్రత్యేకత. మిగతా ప్రాంతాల్లో పేపర్ షాట్ల తొలగింపునకు శానిటేషన్ కార్మికులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పారు. 

ప్రతిఏటా నిమజ్జనం చివరి రెండు రోజుల్లోనే ఎక్కువగా చెత్త, వ్యర్థాలు వస్తుండడంతో ఈ ఆదివారం, సోమవారం జీహెచ్ఎంసీ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సోమవారం సాయంత్రానికి పూర్తిగా వ్యర్థాలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.