ఈసారి మహిళా సంఘాలకు 3,403 ఐకేపీ సెంటర్లు..గతేడాది కేటాయించింది 1,500 కేంద్రాలే

ఈసారి మహిళా సంఘాలకు 3,403 ఐకేపీ సెంటర్లు..గతేడాది కేటాయించింది 1,500 కేంద్రాలే
  •     కమీషన్ల రూపంలో వచ్చిన ఆదాయం రూ.162 కోట్లు
  •     ఈ యాసంగిలో మరింత పెరగనున్న కమీషన్​

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో స్వయం సహాయక సంఘాలు మ‌‌హిళా శ‌‌క్తిని చాటుతున్నాయి. ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలు అతివలకు ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయి. ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఏజెన్సీల ద్వారా మొత్తం 8,251 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సుమారు 40 శాతం అంటే 3,403 ఐకేపీ సెంటర్లను మహిళా సంఘాలకే కేటాయించారు. గతంలో 1,500 కేంద్రాలకే పరిమితమైన ఈ సంఖ్య ప్రస్తుతం రెట్టింపు కావడం విశేషం. 

ఇప్పటికే 500 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా.. ఈ నెలాఖరు నాటికి అన్ని సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. గత వానాకాలంలో కొనుగోళ్ల ద్వారా మహిళా సంఘాలు రూ. 80.60 కోట్ల కమీషన్‌‌, యాసంగిలో రూ. 81.65 కోట్ల కమీషన్ ​పొందాయి. ఈ దఫా ధాన్యం సేకరణ పెరగనుండడంతో మహిళా సంఘాల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి సీజన్‌‌లో సుమారు 40 లక్షల మంది రైతుల నుంచి 25 లక్షల టన్నుల ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా సేకరిస్తున్నారు. 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించేది  మహిళా సంఘాలే : మంత్రి సీతక్క

ఇప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నది మహిళా సంఘాలేనని మంత్రి సీతక్క కొనియాడారు. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తోంద‌‌న్నారు. ఐకేపీ సెంటర్ల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయ‌‌ని పేర్కొన్నారు. ఈ కేంద్రాల నిర్వహణలో మహిళల నిబద్ధత రైతుల్లో విశ్వాసాన్ని పెంచిందని, భవిష్యత్తులో వారికి సాంకేతిక శిక్షణ అందించి, ఈ వ్యవస్థను బలోపేతం చేస్తామని సెర్ప్‌‌ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు.