- టెండర్ దశలోనే క్లీన్వాటర్చాంబర్లు, సబ్ స్టేషన్
- కార్మిక కాలనీల్లో నీటి కష్టాలు ఎదురయ్యే చాన్స్
- మూడు ఏరియాలకు 35 ఎంఎల్‌డీ వాటర్సప్లై ఎప్పుడో..?
గోదావరిఖని, వెలుగు: రామగుండం ప్రాంతంలో కోల్‌బెల్ట్ వాసులకు తాగునీటి కష్టాలు ఈఏడాది కూడా తొలిగేలా లేవు. రూ.14 కోట్లతో ‘ర్యాపిడ్ శాండ్ గ్రావిటీ ఫిల్టరేషన్(ఆర్‌జీఎఫ్) ప్లాంట్’ నిర్మిస్తే తమ తాగునీటి కష్టాలు తీరుతాయని కార్మికులు ఆశపడ్డారు.
కానీ ఆర్‌జీఎఫ్ ప్లాంట్ పూర్తయి అందుబాటులోకి వచ్చినా.. శుద్ధి చేసిన నీటిని నిల్వచేసేందుకు క్లీన్వాటర్చాంబర్లు నిర్మించలేదు. ఇవి పూర్తయితేనే గోదావరి నది నుంచి నీటిని తీసుకుని ప్లాంట్‌లో శుద్ధి చేసి సింగరేణి ఆర్జీ 1, 2, 3 ఏరియాల్లోని కార్మిక కాలనీలు, పారిశ్రామిక ప్రాంతవాసులకు అందించే చాన్స్ ఉంటుంది. ఇలా ప్రతిరోజూ 35 మిలియన్ లీటర్స్ ఫర్ డే (ఎంఎల్‌డీ) వాటర్‌ను అందించాల్సి ఉండగా.. ఇంకా ఆచరణలోకి రాలేదు.
కార్మిక కాలనీలకు రంగు నీళ్లే దిక్కు...
గోదావరి ఒడ్డున సింగరేణికి చెందిన ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా మోటర్ల సహాయంతో ఫిల్టర్బెడ్లోకి నీటిని చేర్చి అక్కడి నుంచి పంప్‌హౌస్‌లో శుద్ధి చేసి కార్మిక కాలనీలకు సప్లై చేసేవారు. వర్షాకాలంలో మాత్రం నీరు సరిగ్గా శుద్ధి కాక ఇబ్బందిగా మారేది. తాగేనీరు ఎరుపు రంగులో వస్తుండడంతో ఆ నీటిని తాగలేక కార్మిక కుటుంబాలు ఆర్‌వో ప్లాంట్ల నుంచి కొనుక్కునేవారు. ఈ క్రమంలో సింగరేణి పలు ఏరియాల్లో ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి మేనేజ్‌మెంట్ చర్యలు చేపట్టింది. కానీ తాగునీటిని నిల్వ చేసే క్లీన్వాటర్చాంబర్ల నిర్మాణం చేపట్టకపోవడంతో అది పూర్తయ్యేవరకు కార్మిక కుటుంబాలకు రంగు నీళ్లే దిక్కయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
రూ.14 కోట్లతో ఆర్‌జీఎఫ్ ప్లాంట్ పూర్తి
సింగరేణి రామగుండం ప్రాంతంలో గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, సెంటినరీకాలనీల్లో పలు ఏరియాల్లో ప్రైవేటు ఇళ్లకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో రూ.14 కోట్లతో ఆర్‌జీఎఫ్ ప్లాంట్ నిర్మాణాన్ని గంగానగర్ జీడీకే 1వ గని సమీపంలో పూర్తిచేశారు. 20 ఎంఎల్‌డీ, 15 ఎంఎల్‌డీ సామర్థ్యాలు గల రెండు ప్లాంట్ల ద్వారా రోజుకు 35 ఎంఎల్‌డీ వాటర్‌ను శుద్ధి చేసేలా ప్లాంట్లు నిర్మించారు.
నిధుల కొరతే కారణమా..?
గోదావరిఖని జీడీకే1వ గని సమీపంలో 35 ఎంఎల్‌డీ ఆర్‌జీఎఫ్ ప్లాంట్ నుంచి వచ్చిన శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసి, దానికి ముందు భాగంలో క్లీన్ వాటర్ చాంబర్ల కోసం కందకాన్ని తవ్వారు. కానీ దీని నిర్మాణం ఇంకా టెండర్ దశలోనే ఉంది. దీంతోపాటు సబ్‌స్టేషన్, ఇంటర్నల్రోడ్లు, ప్లాంట్చుట్టూ కాంపౌండ్‌వాల్ నిర్మించాలి. దీనికి సుమారు రూ.11 కోట్లు అవసరమవుతాయి. నిధుల కొరత వల్లే సింగరేణి కార్పొరేట్బోర్డు తాత్సారం చేస్తున్నదనే ప్రచారం జరుగుతోంది.
త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి తాగునీటిని సప్లై చేయాలే...
సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని సప్లై చేయడం కోసం చేపట్టిన ప్లాంట్, క్లీన్‌వాటర్ చాంబర్లను వెంటనే నిర్మించాలి. ప్రస్తుతం సింగరేణి సప్లై చేస్తున్న నీటిని ఎవరూ తాగడం లేదు. తాగునీటి కోసం ఆర్‌వో ప్లాంట్లపైనే ఆధారపడుతున్నారు. తాత్సారం చేయకుండా క్లీన్ వాటర్ చాంబర్లు నిర్మాణానికి టెండర్లు పిలవాలి. - మెండె శ్రీనివాస్, సీఐటీయూ సెక్రెటరీ
