బీజేపీ మూడో లిస్ట్​లో 35 మంది.. మొత్తం మూడు విడతల్లో 88 సీట్లకు అభ్యర్థుల ప్రకటన..

బీజేపీ మూడో లిస్ట్​లో 35 మంది.. మొత్తం మూడు విడతల్లో 88 సీట్లకు అభ్యర్థుల ప్రకటన..
  • 31 స్థానాలు పెండింగ్​
  • థర్డ్​ లిస్టులో ఒక్క మహిళకే అవకాశం
  • దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, సినీ నటులు జయసుధ, జీవితకు దక్కని చోటు
  • 88 సీట్లలో ఓసీలకు 34, బీసీలకు 32 స్థానాలు.. ఎస్సీలకు 13, ఎస్టీలకు 9, మహిళలకు 13 సీట్లు
  • జనసేన అడుగుతున్న శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, తాండూర్ సీట్లు హోల్డ్​లో..!
  • వేములవాడ, హుస్నాబాద్​పై పట్టువీడని ఈటల, సంజయ్  
  • టికెట్​ ఇచ్చినా పోటీ చేయబోనన్న బాబూమోహన్​కు ఆందోల్ టికెట్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో లిస్ట్​ను ఆ పార్టీ హైకమాండ్ గురువారం ప్రకటించింది. ఇందులో 35 స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేసింది. వీరిలో బీసీలు 13 మంది, రెడ్డీలు 11 మంది, ఎస్సీలు ఐదుగురు, ఎస్టీలు ముగ్గురు..  వెలమ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. ఈ మూడో జాబితాతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 88 సీట్లకు అభ్యర్థులను బీజేపీ ఫైనల్​ చేసింది. ఇంకా 31 సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీ అడుగుతున్న శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, తాండూర్ సీట్లలో ఇంతవరకు బీజేపీ ఎవరి పేర్లనూ ప్రకటించలేదు. జనసేనకు ఇచ్చే సీట్లపై ఈ నెల 5, 6 తేదీల్లో  క్లారిటీ రానుంది. సుమారు 10 స్థానాలను  ఆ పార్టీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటి వరకు బీజేపీ ప్రకటించిన మొత్తం 88 సీట్లలో సామాజిక వర్గాలవారీగా చూస్తే ఓసీలకు 34, బీసీలకు 32, ఎస్సీలకు 13, ఎస్టీలకు 9 సీట్లు దక్కాయి. ఇందులో 13 మంది మహిళలకు చోటు కల్పించారు.

బీజేపీ మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో మహిళకు కేవలం ఒక్క సీటును కేటాయించారు.  హుజూర్ నగర్ నుంచి చల్లా శ్రీలతారెడ్డి పేరు మాత్రమే ఇందులో ఉంది. సికింద్రాబాద్ నుంచి జీహెచ్​ఎంసీ మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, ముషీరాబాద్ నుంచి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి టికెట్​ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ.. పార్టీ మాత్రం వారికి ఇవ్వలేదు. సికింద్రాబాద్​ స్థానాన్ని మేకల సారంగపాణికి, ముషీరాబాద్​ స్థానాన్ని పూస రాజుకు కేటాయించింది. సినీ నటి జయసుధను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆమెకు సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆ రెండు స్థానాల అభ్యర్థుల పేర్లలో ఆమె పేరు కూడా లేదు. సినీ నటి జీవిత శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు పార్టీకి  దరఖాస్తు చేసుకున్నారు. అయితే జూబ్లీహిల్స్​ సీటును దీపక్​రెడ్డికి ప్రకటించిన పార్టీ.. శేరిలింగంపల్లి, కూకట్​పల్లి స్థానాలను పెండింగ్​లో పెట్టింది. జనసేన ఈ స్థానాలను ఆశిస్తున్నది. సనత్ నగర్ సీటు కోసం మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి ఆకుల విజయ దరఖాస్తు చేసుకోగా.. మర్రి శశిధర్​రెడ్డికి ఆ సీటు దక్కింది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అంబర్ పేట టికెట్ ఆశించగా.. మాజీ మంత్రి కృష్ణ యాదవ్​కు ఆ సీటు దక్కింది.

జనసేన అడుగుతున్న సీట్లు పెండింగ్ లో..!

పొత్తులో భాగంగా జనసేన పార్టీ అడుగుతున్న శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, తాండూర్ వంటి సీట్లను బీజేపీ పెండింగ్​లో పెట్టింది. జనసేన చీఫ్​ పవన్ కల్యాణ్​ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండడంతో ఆయన రాగానే పొత్తులు, సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ ఇప్పటివరకు 88 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు పది సీట్లు ఇస్తే.. ఇంకా మిగిలిన 21 సీట్లకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించనుంది. జనసేన సీట్లపై ఈ నెల 5, 6  తర్వాతనే స్పష్టత వస్తుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

వేములవాడ, హుస్నాబాద్  సీట్లపై ప్రతిష్టంభన

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్  లోక్​సభ నియోజకవర్గంలోని వేములవాడ, హుస్నాబాద్ సీట్లపై ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఈ రెండు సీట్ల కోసం బండి సంజయ్​, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ పట్టుపడుతుండటంతో హైకమాండ్ మూడో జాబితాలో కూడా ఇక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు. వేములవాడలో వికాస్ రావుకు ఇవ్వాలని సంజయ్, అక్కడ తుల ఉమకు ఇవ్వాలని ఈటల కోరుతున్నారు. హుస్నాబాద్​లో బొమ్మ శ్రీరాం కోసం సంజయ్, సురేందర్ రెడ్డి కోసం ఈటల కోరుతుండటంతో హైకమాండ్​ పెండింగ్​లో పెట్టింది.  

కిషన్ రెడ్డి, లక్ష్మణ్  సీట్లలో అభ్యర్థుల ప్రకటన

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ  లక్ష్మణ్  ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో వారు గతంలో ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గాలైన అంబర్ పేట, ముషీరాబాద్ సీట్లపై చాలా మంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా అంబర్ పేట సీటును మాజీ మంత్రి కృష్ణ యాదవ్​కు, ముషీరాబాద్ సీటును పూస రాజుకు పార్టీ హైకమాండ్​ కేటాయించింది. అంబర్ పేట టికెట్​ను హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆశించారు. ముషీరాబాద్ టికెట్​ కోసం పార్టీ నేత  గోపాల్ రెడ్డి, కార్పొరేటర్ పావని విజయ్, దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆశించారు. కానీ పూస రాజుకు ఇచ్చారు. బీజేపీ నేతలు తనకు, తన కొడుక్కు మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని, టికెట్ ఇచ్చినా  పోటీ చేయబోనని ఇటీవల మీడియాతో సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్  తేల్చిచెప్పారు. కానీ, మూడో జాబితాలో ఆయన పేరు ఉంది.

బీజేపీ మూడో జాబితాలోని అభ్యర్థులు

అసెంబ్లీ సెగ్మెంట్    అభ్యర్థి పేరు
మంచిర్యాల        వీరబెల్లి రఘునాథ్    
ఆసిఫాబాద్( ఎస్టీ )    అజ్మీరా ఆత్మారాంనాయక్    
బోధన్                వడ్డి మోహన్ రెడ్డి
బాన్సువాడ        యెండల లక్ష్మీనారాయణ    
నిజామాబాద్ రూరల్    దినేష్  కులాచారి    
మంథని        చందుపట్ల సునీల్ రెడ్డి
మెదక్                పంజా విజయ్ కుమార్     
నారాయణ ఖేడ్    సంగప్ప    
ఆందోల్ (ఎస్సీ)    బాబూమోహన్
జహీరాబాద్(ఎస్సీ)    రామచంద్ర రాజనర్సింహా
ఉప్పల్            ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్    
ఎల్బీనగర్        సామ రంగారెడ్డి
రాజేంద్రనగర్        తోకల శ్రీనివాస్ రెడ్డి
చేవెళ్ల(ఎస్సీ)        కేఎస్ రత్నం
పరిగి                భూనేటి మారుతీ కిరణ్    
ముషీరాబాద్        పూస రాజు    
మలక్ పేట        సామరెడ్డి సురేందర్ రెడ్డి
అంబర్ పేట        కృష్ణయాదవ్     
జూబ్లీహిల్స్        లంకల దీపక్ రెడ్డి
సనత్ నగర్        మర్రిశశిధర్ రెడ్డి
సికింద్రాబాద్        మేకల సారంగపాణి
నారాయణపేట    రతంగ్ పాండురెడ్డి
జడ్చర్ల                చిత్తరంజన్ దాస్    
మక్తల్                జలంధర్ రెడ్డి
వనపర్తి        అశ్వథ్థామ రెడ్డి
అచ్చంపేట(ఎస్సీ)    దేవని సతీశ్ మాదిగ
షాద్ నగర్         అందె బాబయ్య    
దేవరకొండ(ఎస్టీ)    కేతావత్ లాలు నాయక్
హుజూర్ నగర్    చల్లా శ్రీలతారెడ్డి
నల్లగొండ        మాదగాని శ్రీనివాస్ గౌడ్
ఆలేరు                పడాల శ్రీనివాస్    
పరకాల        డాక్టర్ పీ కాళిప్రసాద్ రావు    
పినపాక(ఎస్టీ)        పోడియం బాలరాజు
పాలేరు        నున్న రవికుమార్
సత్తుపల్లి(ఎస్సీ)    రామలింగేశ్వర్ రావు