పోలీస్​ ఆఫీసర్ల పేరుతో 350 నకిలీ ఫేస్​బుక్‌లు

పోలీస్​ ఆఫీసర్ల పేరుతో 350 నకిలీ ఫేస్​బుక్‌లు

దేశంలో 350.. తెలంగాణలో  81 మంది పేరుతో అకౌంట్స్​

డబ్బులు పంపాలంటూ ఫ్రెండ్స్​కు రిక్వెస్ట్​

రాజస్థాన్​ ముఠా అరెస్టు

నల్గొండ అర్బన్‍, వెలుగు: వారంతా పెద్ద చదువులు చదవలేదు. 7వ తరగతి నుంచి డిగ్రీ వరకే చదివారు. కానీ ఏకంగా పోలీస్​ఆఫీసర్ల పేరుతోనే 350 వరకు నకిలీ ఫేస్‍బుక్‍ అకౌంట్స్ ఓపెన్‍ చేసి డబ్బులు పంపాలంటూ రిక్వెస్టులు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. విచారణ నిర్వహించిన నల్గొండ పోలీసులు రాజస్థాన్​కు చెందిన నలుగురు సభ్యుల ముఠాను ఆ రాష్ట్రానికి వెళ్లి మరీ అరెస్టు చేశారు. శనివారం నిందితులను మీడియా ముందు నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‍ ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‍పూర్‍ జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ముస్తఖీమ్ ఖాన్, షాహిద్, సద్దాం ఖాన్, మరో మైనర్​కలిసి రోడ్ల మీద వెళ్లేవారిని బెదిరించి డబ్బులు దోచుకునేవారు. అలాగే ఓఎల్ఎక్స్ లో ఆర్మీకి చెందిన వెహికల్స్, ఇతర వస్తువులు తక్కువ ధరకు అమ్ముతామంటూ బ్యాంక్ అకౌంట్లు, గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకోవడం లాంటి సైబర్ మోసాలకు పాల్పడేవారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తో రోడ్లపై వెహికల్స్​సరిగా నడవకపోవడం, ఓఎల్ఎక్స్​ద్వారా ప్రజల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడం, ఇలాంటివాటిపై అందరికి అవగాహన పెరగడంతో సులభంగా డబ్బు సంపాదించడానికి కొత్తరకం మోసాలకు తెర తీశారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‍, తమిళనాడు, కర్ణాటకతోపాటు హిమాచల్‍ ప్రదేశ్‍, ఉత్తరాఖండ్‍, ఉత్తరప్రదేశ్‍ రాష్ట్రాలకు  చెందిన 350 మంది పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లను క్రియేట్ చేశారు. ఇందులో తెలంగాణకు చెందిన 81 మంది పోలీస్​ఆఫీసర్లు ఉన్నారు. వారి ఫ్రెండ్స్​లిస్ట్​లో ఉన్నవారికి రిక్వెస్ట్ పంపించడంతోపాటు అత్యవసరంగా డబ్బు అవసరమని, ఫోన్​పే చేయమంటూ కొందరికి మెసెంజర్ ద్వారా మెసేజ్​చేసేవారు.

ఒక్కో సిమ్ రూ. 500, రూ. 3000

మోసాలకు పాల్పడేందుకు ముఠా సభ్యులు ఒక్కో సిమ్​ను రూ. 500, రూ. 3000 పెట్టి కొనేవారు. హరియాణా, గుజరాత్‍, రాజస్థాన్​రాష్ట్రాలకు చెందిన అనామకుల పేరుతో సిమ్‍ కార్డులను కొనుగోలు చేసి ఓ  వ్యక్తి 15 రోజులకోసారి కేత్వాడకు వచ్చి వీరికి అందజేసేవాడు. రూ. 3 వేలతో కొన్న సిమ్‍కు బ్యాంకు ఖాతా, గూగుల్‍ పే, ఫోన్‍ పే, ఏటీఎం లింక్‍ చేసి ఉండేవి. నకిలీ ఫేస్​బుక్​అకౌంట్లలో వీరి రిక్వెస్ట్​లకు స్పందించి ఎవరైనా డబ్బులు పంపిస్తే వాటిని డ్రా చేసుకునేవారు.  ఇక రూ.500తో కొన్న సిమ్‍ కార్డుకు బ్యాంకు అకౌంట్‍ లేని ఫోన్‍ పే, గూగుల్‍ పే మాత్రమే ఉండేవి. అలా వచ్చిన డబ్బులను ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఫోన్‍ పేకు ట్రాన్స్ ఫర్‍ చేసి కమీషన్‍ పద్ధతిన డబ్బులు తీసుకునేవారు.

నల్గొండ నుంచి రాజస్థాన్​కు పోలీస్‍ బృందం

నెలన్నర క్రితం నల్గొండ ఎస్పీ రంగనాథ్​పేరుతో ఫేక్​ఐడీ క్రియేట్​చేశారు. విషయం ఎస్పీ దృష్టికి రావడంతో తన పేరుతో ఫేక్​ఐడీ క్రియేట్​చేశారని, ఎవరూ డబ్బులు పంపించొద్దంటూ సోషల్​మీడియా ద్వారా ఫ్రెండ్స్, ఇతరులకు తెలియజేశారు. కొద్దిరోజులకే ఎస్పీ పేరుతో మరో ఫేక్​ఐడీ క్రియేట్​చేశారు. వారి రిక్వెస్టులు నమ్మి కొందరు డబ్బులు సైతం పంపించారు. దీంతో విషయాన్ని సీరియస్​గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. టెక్నాలజీ ఆధారంగా నిందితులు రాజస్థాన్​లో ఉన్నట్లు నల్గొండ పోలీసులు కనిపెట్టారు. ఇక్కడి నుంచి ఆ రాష్ట్రానికి వెళ్లారు. రాజస్థాన్‍ క్విక్‍ రాపిడ్​టీమ్(క్యూఆర్టీ)తో కలిసి ఏడు బృందాలు కేత్వాడ గ్రామానికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏ1 నిందితుడు ముస్తఖీమ్‍ ఖాన్. ఇతను గ్రామంలోని అందరికీ  నకిలీ ఫేస్‍బుక్‍ అకౌంట్లు ఎలా క్రియేట్​చేయాలో నేర్పించాడు. పోలీసులు గ్రామానికి వెళ్లినపుడు ముస్తఖీమ్​మొదట తప్పించుకున్నాడు. రెండు రోజులు గ్రామ పెద్దలతో మాట్లాడి.. వారికి నచ్చజెప్పి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. లక్ష నగదు, నకిలీ ఆధార్​కార్డులు, 8 మొబైల్​ఫోన్లు, 30 సిమ్​కార్డులు, ఒక ల్యాప్​టాప్, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును సాల్వ్​చేయడంలో కీలకంగా పనిచేసిన నల్గొండ టూటౌన్ సీఐ ఎస్ఎం  బాషా, రూరల్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్స్ శంషుద్దీన్, బాలకోటిలతో పాటు సాంకేతికంగా ఎప్పటికప్పుడు సహకరించిన ఐటీ  టీమును ఎస్పీ రంగనాథ్​ ప్రత్యేకంగా అభినందించారు. వారికి  రివార్డు అందజేస్తామని తెలిపారు.

For More News..

అత్యాచారాలపై యుద్ధానికి మోడీ నాయకత్వం వహించాలి: కైలాస్ సత్యార్థి

పండుగ ఆఫర్లు షురూ.. త్వరలో ఫ్లిప్‌‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’

రిలీజైన గంటల్లోనే యూఎస్‌‌ బెస్ట్ సెల్లర్‌‌ లిస్ట్‌‌లో చేరిన ప్రియాంక బుక్

పాత కారు కొనడానికి రైట్​ టైం ఇదే!