ఏడాదిలో 48 శాతం పెరిగిన ఇండ్ల సేల్

ఏడాదిలో 48 శాతం పెరిగిన ఇండ్ల సేల్
  • వార్షికంగా 48 శాతం పెరుగుదల
  • రూ.3,46,960 కోట్ల విలువైన యూనిట్ల అమ్మకం
  • హైదరాబాద్​ సేల్స్​ 50% అప్

న్యూఢిల్లీ: మెట్రో సిటీల్లో ఇండ్లు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏడు మెట్రో  నగరాల్లో హౌసింగ్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 48 శాతం పెరిగి రూ. 3.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ రిపోర్ట్​ ప్రకారం, రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాల విలువ 2021–22లో రూ. 2,34,850 కోట్ల నుండి గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,46,960 కోట్లకు పెరిగింది. వాల్యూమ్ పరంగా చూస్తే, 2022–23లో అమ్మకాలు 36 శాతం పెరిగి 3,79,095 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు సంవత్సరంలో 2,77,783 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ డేటా ప్రైమరీ హౌసింగ్ మార్కెట్ లావాదేవీలకు సంబంధించినదని అనరాక్​ తెలిపింది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ దూసుకెళ్తూనే ఉందని, మునుపటి రికార్డులను తిరగరాస్తోందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి అన్నారు.

ఈ సంస్థ లెక్కల ప్రకారం, ఢిల్లీ–ఎన్‌‌‌‌సిఆర్‌‌లో ఇండ్ల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.35,610 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.50,620 కోట్లకు చేరుకున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో అమ్మకాలు 46 శాతం వృద్ధితో రూ.1,14,190 కోట్ల నుంచి రూ.1,67,210 కోట్లకు పెరిగాయి. బెంగళూరులో హౌసింగ్​ యూనిట్ల విక్రయాలు 49 శాతం పెరిగి రూ.26,100 కోట్ల నుంచి రూ.38,870 కోట్లకు చేరుకున్నాయి. పూణెలో ఇండ్ల విక్రయాలు రూ.19,100 కోట్ల నుంచి 77 శాతం పెరిగి రూ.33,730 కోట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్‌‌లో సేల్స్​ 50 శాతం పెరిగి రూ.23,190 కోట్ల నుంచి రూ.34,820 కోట్లకు చేరుకున్నాయి. చెన్నై విక్రయాలు 24 శాతం వృద్ధితో రూ.8,940 కోట్ల నుంచి రూ.11,050 కోట్లకు చేరుకున్నాయి.

కోల్‌‌కతాలో ఇండ్ల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,720 కోట్ల నుంచి 38 శాతం పెరిగి రూ.10,660 కోట్లకు చేరుకున్నాయి. గురుగ్రామ్‌‌కు చెందిన లగ్జరీ రియాల్టీ సంస్థ క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ ఈ ట్రెండ్‌‌పై మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో ఇండ్ల నిర్మాణ రంగం మరింత పుంజుకుందని అన్నారు. డిమాండ్ బాగుందని, పెట్టుబడిదారులు కూడా మార్కెట్‌‌కు తిరిగి వస్తున్నారని జైన్ చెప్పారు. తక్కువ ధరల్లో ఇండ్లు కట్టిచ్చే రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్, చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ మాట్లాడుతూ, మిలీనియల్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్‌‌లో చురుకుగా పెట్టుబడులు పెడుతున్నారని, ఇది అమ్మకాల పెరుగుదలకు దోహదపడుతుందని అన్నారు.