
- అవినీతి రెవెన్యూ ఆఫీసర్లపై థాయ్‌లాండ్ సర్కార్ వేటు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ రెవెన్యూ డిపార్ట్ మెంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన నలుగురు ఆఫీసర్లను ప్రభుత్వం తొలగించింది. ముగ్గురు మహిళా ఆఫీసర్లు, ఒక పురుష ఆఫీసర్ కలిసి ఏకంగా రూ. 474 కోట్లు (200 కోట్ల బాట్లు) అక్రమంగా సంపాదించారని ప్రభుత్వం గుర్తించింది. బ్యాంకాక్‌కు సమీపంలోని సముత్ ప్రఖాన్ ప్రావిన్స్‌లోని రెవెన్యూ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్న ఈ నలుగురి బ్యాంక్ అకౌంట్లలో అకస్మాత్తుగా కోట్లాది రూపాయలు డిపాజిట్ కావడాన్ని గుర్తించిన నేషనల్ యాంటీ కరప్షన్ అధికారులు ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఆఫీస్‌కు తెలియజేశారు.
వీరిలో దనాయి దామ్రోగ్చయోతిన్ అనే వ్యక్తికి చెందిన ఏడు అకౌంట్లలో రూ.261 కోట్లు (110 కోట్ల బాట్లు), మిగతా ముగ్గురు మహిళలకు చెందిన ఐదు అకౌంట్లలో రూ.118 కోట్ల(50 కోట్ల బాట్లు)కుపైనే డిపాజిట్ అయినట్లుగా విచారణలో గుర్తించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న వివరాలు చెప్పలేక సదరు ఆఫీసర్లు నీళ్లు నమిలారు. దీంతో ఇదంతా అక్రమార్జనగా గుర్తించి ప్రభుత్వం వేటు వేసింది.