మోదీ@ 12 ఇయర్స్... దేశ ప్రధానిగా వరుసగా 4,399 రోజులు పూర్తి 

మోదీ@ 12 ఇయర్స్... దేశ ప్రధానిగా వరుసగా 4,399 రోజులు పూర్తి 
  • అత్యధిక కాలం ప్రధానిగా నెహ్రూ పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్ 

ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌‌లాల్‌‌ నెహ్రూను అధిగమించి ఈ ఘనతను సాధించారు. మోదీ బుధవారంతో ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. 12 ఏండ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఎన్డీయే కూటమి నాయకులతో పాటు ప్రపంచ దేశాల అధినేతలు ప్రధానికి అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు.  

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుకు12 ఏండ్లు పూర్తయ్యాయి. బుధవారం నాటికి 12 ఏండ్ల 15 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన.. వరుసగా 4,399 రోజులు ఈ పదవిలో ఉండటం ద్వారా దేశంలో బ్రేక్ లేకుండా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా సరికొత్త రికార్డు సృష్టించారు. 2014 మే 26న మొదటిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోదీ.. అప్పటి నుంచి పదవిలో (వరుసగా మూడోసారి) కొనసాగుతున్నారు.  

బుధవారంతో ఆయన ప్రధానిగా 4,399 రోజులు అంటే12 ఏండ్ల 15 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఇప్పటిదాకా దేశంలో వరుసగా అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా జవహర్‌‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ప్రధాన మంత్రిగా నెహ్రూ 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు వరుసగా 4,398 రోజులు పని చేశారు. నిజానికి నెహ్రూ 1947 ఆగస్టు 15 నుంచే మన దేశానికి తాత్కాలిక ప్రధానిగా(ఎన్నికలు లేకుండా) ఉన్నారు. అయితే, రాజ్యాంగం అమలులోకి వచ్చాక1952లో దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించి నెహ్రూ తొలిసారిగా ఎలక్షన్ ద్వారా ఎన్నికైన ప్రధానిగా 1952 మే 13న  ప్రమాణస్వీకారం చేశారు. 

1964 మే 27న ఆయన  మరణించే వరకు 4,398 రోజులు పదవిలో కొనసాగారు. 1947 నుంచి లెక్కిస్తే నెహ్రూ మొత్తం పదవీకాలం 16 ఏండ్ల 286 రోజులు అంటే... మొత్తంగా 6,130 రోజులు ప్రధానిగా పనిచేశారు. అలాగే, వరుసగా అత్యధిక కాలం భారత ప్రధానిగా కొనసాగిన వారి జాబితాలో ఇందిరాగాంధీ మూడో స్థానంలో ఉన్నారు. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులు పదవిలో ఉన్నారు. మొత్తంగా  ఆమె 15 ఏండ్లకు పైగా (5,829 రోజులు) ప్రధానిగా పనిచేశారు. అయితే, రాజ్యాంగబద్ధంగా ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాల కాలపరిమితిని బట్టి చూస్తే.. నరేంద్ర మోదీ సాధించిన ఈ 4,399 రోజుల సుదీర్ఘ ప్రస్థానం భారత రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

మోదీకి అభినందనల వెల్లువ

మోదీ 12 ఏండ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఎన్డీయే కూటమి నాయకులతో పాటు ప్రపంచ దేశాల అధినేతలు ప్రధానికి పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రధానిగా అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన మోదీకి కేంద్ర మంత్రివర్గం కూడా అభినందనలు తెలిపింది. అలాగే, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తదితరులు మోదీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, దేశ ప్రగతికి ఆయన చేసిన కృషిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌‌లు పెట్టారు. 

మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, శ్రీలంక అధ్యక్షుడు అరుణ కుమార దిసనాయకేతోపాటు అమెరికా, నేపాల్, మంగోలియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల నేతలున్నారు.