హైదరాబాద్‌సిటీ,వెలుగు: కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా నగరంలోని పలు హోటళ్ల నిర్వాహకులు కస్టమర్ల నుంచి ప్రత్యేకంగా గ్యాస్చార్జీలు వసూలు చేస్తున్నారు. వారం రోజులుగా సోషల్ మీడియాలో చెన్నైలోని హోటళ్ల నిర్వాహకులు కస్టమర్ల నుంచి గ్యాస్ చార్జీలను ప్రత్యేకంగా వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ కొన్ని హోటళ్ల నిర్వాహకులు అదే ఫాలో అవుతున్నారు.
సికింద్రాబాద్‌లోని ఓ ఉడిపి హోటల్లో టిఫిన్ సమయంలో కస్టమర్ల నుంచి మొత్తం బిల్లుపై 5 శాతం గ్యాస్ పన్నుగా వసూలు చేస్తున్నారు. నగరంలోని మరికొన్ని హోటళ్లు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 50 వేల కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
ప్రస్తుతం గల్ఫ్‌యుద్ధం వల్ల కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడింది. హోటళ్ల నిర్వాహకులు కస్టమర్లపై గ్యాస్చార్జీగా బిల్లుపై 5 శాతం అదనంగా వసూలు చేయడంపై నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
