డేంజర్ పారాక్వాట్..విరుగుడులేని గడ్డిమందుకు తెలంగాణలో ఏటా 5 వేల మంది బలి

డేంజర్ పారాక్వాట్..విరుగుడులేని గడ్డిమందుకు తెలంగాణలో ఏటా 5 వేల మంది బలి
  •  
  • విరుగుడులేని గడ్డిమందుకు రాష్ట్రంలో ఏటా 5 వేల మంది బలి 
  •     తాగిన ప్రతి 100 మందిలో  98 మంది మృతి
  •     ఒక్కో జిల్లాలో ఏటా 200 కేసులు 
  •     పొలాల్లో మాస్కుల్లేకుండా స్ప్రే చేసినా డేంజరే.. 
  •     గాలి పీల్చినా ఊపిరితిత్తులు, కిడ్నీలు ఖరాబ్
  •     వాడితే భూమి నిర్జీవం 
  •     పారాక్వాట్ బ్యాన్​పై ఐఎంఏ, మెడికల్ కౌన్సిల్​తో పాటు డాక్టర్ల సంఘాల ఉమ్మడి ఫైట్

హైదరాబాద్, వెలుగు: విరుగుడే లేని ‘పారాక్వాట్’ గడ్డి మందు మన రాష్ట్రంలో ఏటా 5 వేల మందిని బలిగొంటున్నది. అప్పుల బాధతో రైతులు.. చదువు, ప్రేమ తదితర కారణాలతో స్టూడెంట్స్, యువత క్షణికావేశంలో తాగి తిరిగిరాని లోకాలకు పోతున్నారు. ఈ మందు తాగిన ప్రతి వంద మందిలో 98 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ పారాక్వాట్​ను పంట చేన్లలో గడ్డిని నాశనం చేయడానికి వాడుతారు. క్షణాల్లో గడ్డిని మాడ్చేసే శక్తి దీనికి ఉంటుంది. కానీ, క్షణికావేశంలో ఈ మందు తాగినా, పిచికారీ చేసేటప్పుడు ఏమరపాటుగా ఉన్నా నేరుగా శరీరంలోని కీలక అవయవాలపై అటాక్ చేస్తుంది. గొంతు, పేగులు కాలిపోతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. పల్మనరీ ఫైబ్రోసిస్ తలెత్తి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఆ తర్వాత కిడ్నీలు, లివర్ ఫెయిల్ అవుతాయి. బాధితులు తీవ్రమైన నొప్పితో, ఊపిరాడక చనిపోతారని డాక్టర్లు చెప్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, వ్యవసాయ భూములను నాశనం చేస్తున్న పారాక్వాట్​ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని అటు డాక్టర్ల సంఘాలు, ఇటు రాజకీయ నాయకులు డిమాండ్​ చేస్తున్నారు.

రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో ఏటా సుమారు 200 పారాక్వాట్ కేసులు నమోదవుతున్నట్లు అంచనా. ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల మరణాలు జరగుతున్నట్లు డాక్టర్ల సంఘాలు నిర్ధారణకు వచ్చాయి. జిల్లాల్లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కు ఏటా సుమారు 50 వరకు కేసులు, హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్ల మార్చురీలకు ఏటా సుమారు 150 చొప్పున పారాక్వాట్ డెడ్ బాడీలు వస్తున్నాయని తెలుస్తోంది. నిమ్స్ లో 2022 నుంచి 2024 ఏప్రిల్ వరకు ఏడాదిన్నర వ్యవధిలోనే 253 కేసులు వచ్చాయి. ఈ మందు తాగుతున్న వారిలో 20 నుంచి 30 ఏండ్ల లోపు యువతే ఎక్కువ ఉంటున్నారు. రైతులు 36.3% ఉంటే, స్టూడెంట్స్ 46.2% ఉంటున్నారు. నిమ్స్ లో చేరిన వారిలో 96 శాతం మందికి కిడ్నీలు, 85% మందికి లంగ్స్ డ్యామేజ్ అయ్యాయి. హాస్పిటల్ లో మరణాల రేటు ఏకంగా 86 శాతంగా నమోదైంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లెక్కలు తీస్తే ఈ మరణాల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. 

నేలనూ వదలని మందు

ఈ మందు తాగితేనే కాదు, పొలాల్లో స్ప్రే చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోయినా ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రైతులు చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ లేకుండా ఈ మందు కొడితే.. గాలి ద్వారా శ్వాసకోశాల్లోకి వెళ్లి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయంటున్నారు. చర్మంపై పడితే తీవ్రమైన అలర్జీలు వస్తాయి. ఇక, కలుపు మొక్కలు చనిపోవడానికి ఈ మందును ఎడాపెడా కొట్టడం వల్ల వ్యవసాయ భూముల్లో నేల సారం పూర్తిగా దెబ్బతింటోందని, మట్టిలో ఉండే వానపాములు, మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోయి.. భూమి నిర్జీవంగా మారుతోందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ క్రమంలోనే  పారాక్వాట్ ను బ్యాన్ చేయాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్(ఐఎంఏ), తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ), డాక్టర్స్ అగైనెస్ట్ పారాక్వాట్ పాయిజన్(డీఏపీపీ), హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్డీఏ) సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ విరుగుడు లేని విషాన్ని ఇప్పటికే చాలా దేశాల్లో బ్యాన్ చేశారని.. మన దేశంలో కేరళ, పంజాబ్, ఒడిశాలో రద్దు చేశారని పేర్కొన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి పారాక్వాట్ ను దేశ వ్యాప్తంగా బ్యాన్ చేయాలని కోరనున్నట్లు డాక్టర్ల యూనియన్లు  వెల్లడించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 

అసెంబ్లీలో చర్చించేలా చేస్తాం

ప్రాణాలు తీసే మందును అమెజాన్ లో అమ్ముతుండడం దారుణం. గడ్డిని నివారించడానికి పారాక్వాట్ కు బదులు సబ్సిడీ కింద రైతులకు చిన్న చిన్న గడ్డి మిషన్లు ఇస్తే బాగుంటుంది. అమెరికా, చైనా లాంటి దేశాలు డబ్బు సంపాదన కోసం మన వ్యవసాయంలోకి ఈ కెమికల్స్ తెస్తున్నాయి. దీనివల్ల వేల మంది ప్రాణాలు పోతున్నాయి. నేను అగ్రికల్చర్ డైరెక్టర్ కు లెటర్ రాశా.. అమెజాన్ వాళ్లు పర్మిషన్ తీసుకున్నారా? ? దీనికి సంబంధించిన పూర్తి డేటాను శాసనసభ స్పీకర్, వ్యవసాయ శాఖ మంత్రికి త్వరలో ఇవ్వబోతున్నాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై కచ్చితంగా చర్చిస్తం.
- కోదండరెడ్డి, చైర్మన్, రైతు కమిషన్

ప్రివెన్షన్ ఒక్కటే మార్గం 

ప్రస్తుతం వాడుకలో ఉన్న అత్యంత ప్రాణాంతకమైన హెర్బిసైడ్లలో పారాక్వాట్ ఒకటి. ఇది కొద్ది మొత్తంలో శరీరంలోకి వెళ్లినా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగి ప్రాణాలు పోతాయి. దీనికి ఎలాంటి విరుగుడు మందు లేదు కాబట్టి అవేర్నెస్ పెంచాలి. పాలసీలు మార్చాలి. రైతుల భద్రత, ప్రజల ఆరోగ్యమే మన ఫస్ట్ ప్రయారిటీ కావాలి కాబట్టి పారాక్వాట్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి.
డాక్టర్ కార్తీక్ నాగుల, ప్రెసిడెంట్, హెచ్ఆర్డీఏ

ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి: 

పారాక్వాట్ అనేది నాన్-సెలెక్టివ్ హెర్బిసైడ్. ఇది అత్యంత విషపూరితమైనది. తాగితే ఎలాంటి యాంటీ డోట్ లేదు. వ్యవసాయంలో దీన్ని వాడాల్సిన అవసరం లేదు. కలుపు నివారణకు మన దగ్గర చాలా సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి.
- డాక్టర్ రాకేశ్ చెన్నా, వైస్ చైర్మన్, డాక్టర్స్ ఎగైనెస్ట్ పారాక్వాట్ పాయిజన్

పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నది

పారాక్వాట్ పాయిజన్ తీసుకున్న వారిలో 90 నుంచి 100 శాతం మరణాలే సంభవిస్తున్నాయి. ప్రతి జిల్లాలో నెలకు కనీసం 10 నుంచి 20 మంది పారాక్వాట్ వల్ల చనిపోతున్నారు. ఇది మనుషుల ప్రాణాలు తీయడమే కాకుండా.. మట్టిలోని సూక్ష్మజీవులను చంపేసి, పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతోంది. పబ్లిక్ హెల్త్ ను దృష్టిలో ఉంచుకుని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ పారాక్వాట్ ను వెంటనే బ్యాన్ చేయాలి.
- డాక్టర్ గుండగాని శ్రీనివాస్,
 మెంబర్, టీఎంసీ

ఆన్​లైన్​లో యథేచ్ఛగా అమ్ముతున్నారు

పారాక్వాట్ ను జాతీయస్థాయిలో బ్యాన్ చేయాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి గురువారం సభలో డిమాండ్ చేశారు. ‘‘ఇది పల్లెల్లో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది. దీన్ని 74 దేశాలు బ్యాన్ చేశాయి. మన దగ్గర ఆన్​లైన్​లో యథేచ్ఛగా అమ్ముతున్నారు. ఈ మందు తాగి దేశవ్యాప్తంగా వేల మంది చనిపోతున్నారు. 1968 ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ కింద పారాక్వాట్‌‌‌‌ను వెంటనే బ్యాన్ చేయాలి. బాధితులను ఆదుకునేందుకు విక్టిమ్ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయాలి.’’ అని కేంద్రాన్ని కోరారు. 
‌‌‌‌‌‌‌‌- కేఆర్ సురేశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు