వైరల్​ వీడియో : చీరలోనే 56 ఏళ్ల మహిళ జిమ్ వర్కౌట్స్

వైరల్​ వీడియో : చీరలోనే  56 ఏళ్ల మహిళ జిమ్  వర్కౌట్స్

ప్రతీ మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మించింది మరొకటి లేదు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనసరి. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా చెబుతుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను వ్యాయామం చేసి దూరం చేసుకోవచ్చని తమిళనాడుకు చెందిన ఓ 56 ఏళ్ల మహిళ చెబుతోంది. చెన్నైకి చెందిన ఈ మహిళ  నాలుగేళ్ల క్రితం వరకు విపరీతమైన మోకాళ్లు, కాళ్ల నొప్పులతో బాధపడింది. ఆమె కొడుకు చాలా మంది డాక్టర్లకు చూపించాడు. కానీ నయం కాలేదు. 

అయితే ఆమె కోడలు ఒకసారి ఆమెను జిమ్ కు తీసుకెళ్లింది. క్రమం తప్పకుండా అక్కడ వ్యాయామం చేయడంతో ఆరోగ్యంలో ఆమెకు మార్పు కనిపించింది. ఇప్పుడు చాలా ఫిట్ గా ఉంది.  చీరతోనే వెళ్ళి బరువులు ఎత్తుతూ ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్ , మద్రాస్ బార్బెల్ సంయుక్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేయగా .. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె చాలా మందికి స్ఫూర్తిదాయకమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.