రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న క్రియాన్స్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తీసుకువచ్చిన ఆరు నెలల శిశువు వైద్యం వికటించి మృతి చెందింది. విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి తన ఆరు నెలల బాబును అనారోగ్యంతో హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వైద్యులు చికిత్సలో భాగంగా మందులు ఇచ్చారు. మందులు ఇచ్చిన కొద్దిసేపటికే శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. అయితే ఆ మందులు గడువు ముగిసినవని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్‌లో ఆందోళనకు దిగారు. కొంతమంది హాస్పిటల్ వస్తువులను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హాస్పిటల్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శిశువు మృతికి గల అసలు కారణాలపై పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
