హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా టీజీ ఈఏపీసెట్-ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్శనివారం ప్రారంభమయ్యాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు తొలిరోజు రెండు సెషన్లలో కలిపి 93 శాతానికి పైగా హాజరు నమోదైందని ఎప్ సెట్ కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. మొదటి సెషన్ లో మొత్తం 34,823 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 32,540 మంది(93.44%) పరీక్ష రాశారని పేర్కొన్నారు. రెండో సెషన్ లో 34,808 మందికి గానూ 32,390 మంది(93.05%) హాజరైనట్లు చెప్పారు.
కాగా, పరీక్షా కేంద్రాల వారీగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 98.9 శాతం హాజరు నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో నల్గొండ(98.2%), సిద్దిపేట (98.2%) ఉన్నాయి. హైదరాబాద్‌లోని 4 జోన్లలో కలిపి 21 వేల మందికి పైగా విద్యార్థులు అటెండ్ అయ్యారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఉన్నతాధికారులు ఎగ్జామ్స్ప్రక్రియను పర్యవేక్షించారు. టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి, ఎప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
