రూ.653 కోట్ల PF డబ్బులు వాడుకున్నTSRTC

రూ.653 కోట్ల PF డబ్బులు వాడుకున్నTSRTC

హైదరాబాద్‌, వెలుగు: కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్‌), మెంబర్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఫండ్‌(ఎంఆర్‌డీఎఫ్‌), స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం(ఎస్‌ఆర్‌బీఎస్‌), స్టాఫ్ బెనిఫిట్​ ట్రస్ట్​(ఎస్​బీటీ).. వీటి పేరిట కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బులన్నీ టీఎస్​ఆర్టీసీ వాడుకుంటోంది. ఇప్పుడు ప్రావిడెంట్​ ఫండ్​(పీఎఫ్​) డబ్బులను కూడా ఉపయోగించుకుంటోంది. పీఎఫ్​ నుంచి రూ.653 కోట్లు, సీసీఎస్​ డబ్బులు రూ.442 కోట్లు, ఎస్​ఆర్​బీఎస్​ నుంచి రూ.220 కోట్లు, ఎస్‌బీటీ నుంచి రూ.110 కోట్లను సంస్థ వాడేసుకుంది. ఆయా విభాగాల్లో లోన్ల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నా డబ్బులు ఇవ్వడం లేదు.

పీఎఫ్‌ నుంచి రూ.653 కోట్లు

రూ.653 కోట్ల పీఎఫ్‌ డబ్బులు ఉండగా, ఈ డబ్బులను సంస్థ కార్మికులు, ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులకు వాడుకుంది. దీంతో పీఎఫ్‌ కోసం 1,200 మంది దరఖాస్తు చేసుకోగా, పెండింగ్‌లో పెట్టారు. ఏడాది క్రితం కూడా పీఎఫ్​ డబ్బులు వాడుకుంది. తర్వాత అందులో కొంత తిరిగి చెల్లించింది.

సీసీఎస్‌ డబ్బులు రూ.442 కోట్లు

ఎంఆర్‌డీఎఫ్‌ కింద కార్మికుల మూల వేతనాల నుంచి యాజమాన్యం ప్రతి నెలా 6 శాతం చొప్పున మినహాయించి సీసీఎస్‌కు బదలాయిస్తుంది. ఎంఆర్‌డీఎఫ్‌ కింద మినహాయించేవి, రుణాలు తీసుకున్నవారు చెల్లించే వాయిదాల సొమ్ము కలిపి సీసీఎస్‌కు నెలకు రూ.40 కోట్ల దాకా జమ అవుతుంటాయి. సీసీఎస్‌కు జమ అయిన రూ.442 కోట్లను సంస్థ ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రుణాల కోసం 5,104 మంది కార్మికులు సీసీఎస్​కు దరఖాస్తు చేసుకున్నా లోన్లు పెండింగ్‌లో పెట్టారు. ఎస్‌ఆర్‌బీఎస్‌కు చెందిన రూ.220 కోట్లు, ఎస్‌బీటీ నుంచి రూ.110 కోట్లను ఆర్టీసీ వాడుకుంది. ఆర్టీసీని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సర్కార్‌ నుంచి రావల్సిన బిల్లులు విడుదల చేయడం లేదని, అవి సక్రమంగా ఇస్తే సంస్థ కోలుకుంటుందని చెబుతున్నారు.