- రన్ వేపై 50 మీటర్ల కంటే తక్కువగా విజిబిలిటీ.. వందలాది విమానాలు ఆలస్యం
- ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల అవస్థలు.. 40కి పైగా రైళ్ల టైమింగ్స్‌పై ప్రభావం
- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంచు దుప్పటి.. ఉదయం 10 గంటల దాకా వీడని ఫాగ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. లో విజిబిలిటీ కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం 66 విమానాలను ఏవియేషన్ రెగ్యులేటరీ సంస్థ డీజీసీఏ రద్దు చేసింది. రద్దయిన విమానాల్లో 32 ఫ్లైట్లు ఢిల్లీకి రావాల్సినవి ఉండగా.. 34 విమానాలు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సినవి అని ఏవియేషన్ అధికారులు ప్రకటించారు.
దట్టమైన పొగమంచు కారణంగా రన్‌వేపై విజిబిలిటీ చాలా తక్కువగా ఉండటంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు ఆటంకం కలిగింది. డిసెంబర్ 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఉండే ‘ఫాగ్ విండో’ టైమ్‌లో తక్కువ విజిబిలిటీలో పనిచేయగల పైలట్లు, విమానాలను కేటాయించాలని ఇప్పటికే డీజీసీఏ పలు ఎయిర్‌లైన్స్ సంస్థలను ఆదేశించింది.
ప్రయాణికులకు ఫ్లైట్ స్టేటస్ రిపోర్టులు
సాధారణంగా రన్ వేపై 200 మీటర్ల వరకు విజిబిలిటీ ఉంటేనే విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు అధికారులు అనుమతిస్తారు. కానీ.. శుక్రవారం రన్‌వే విజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో సుమారు 66 ఫ్లైట్లను అధికారులు క్యాన్సిల్ చేశారు.
కాగా.. ఇండిగో, ఎయిర్ ఇండియాతో పాటు పలు విమానయాన సంస్థలు ముందుగానే ఫ్లైట్ క్యాన్సిల్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు తెలియజేశాయి. రద్దయిన విమానాలే కాకుండా, వందలాది ఇతర ఫ్లైట్లు కూడా గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందే ఆయా సంస్థల వెబ్‌సైట్లు, కస్టమర్ కేర్ తో మాట్లాడి ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాల్సిందిగా ప్రయాణికులకు విమానయాన సంస్థలు సూచించాయి. విమానాలతో పాటు ఢిల్లీకి వచ్చే సుమారు 40కి పైగా రైళ్లు కూడా పొగమంచు కారణంగా గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో శుక్రవారం కనిష్టంగా 9.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు ఇదే విధమైన పొగమంచు పరిస్థితులు ఉండొచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
గ్రేప్–3 ఆంక్షలు ఎత్తివేత
ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలో ఎయిర్ పొల్యూషన్ తగ్గుముఖం పట్టడంతో అధికారులు గ్రేప్–3 (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3) ఆంక్షలను శుక్రవారం ఎత్తేశారు. కొన్ని రోజులుగా ఢిల్లీ వాసులను ఎయిర్ పొల్యూషన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. గురువారం కురిసిన వర్షం, పెరిగిన గాలుల వేగం కారణంగా కాలుష్యం తగ్గుముఖం పట్టింది.
ఈ నేపథ్యంలో మూడో దశ ఆంక్షలను రద్దు చేస్తున్నట్లు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) ప్రకటించింది. గురువారం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 380 ఉండగా.. శుక్రవారం 236కి మెరుగుపడింది. కాగా, గ్రేప్-3 ఎత్తేసినప్పటికీ.. గ్రేప్ 1, గ్రేప్ 2 ఆంక్షలు మాత్రం కొనసాగుతాయి.
