ఏపీ పొమ్మన్నా..రాష్ట్రం రమ్మంటలే!

ఏపీ పొమ్మన్నా..రాష్ట్రం రమ్మంటలే!
  •   రిలీవ్​కు ఏపీ సర్కారు అంగీకారం
  •   తెలంగాణ ఓకే అంటేనే బదిలీ 
  •   విభజన జరిగి ఐదేండ్లయినా ఏపీలోనే ఉన్నాం
  •   తెలంగాణ థర్డ్, ఫోర్త్ ​క్లాస్​ఎంప్లాయీస్​ ఆవేదన  
  •   రాష్ట్ర సర్కారు పట్టించుకోవట్లేదని మండిపాటు

హైదరాబాద్, వెలుగుఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఏపీ సర్కారు పొమ్మన్నా.. తెలంగాణ సర్కారు మాత్రం రమ్మంటలేదు. విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన తెలంగాణ థర్డ్, ఫోర్త్​క్లాస్ ఎంప్లాయీస్ గోస ఐదేండ్లు దాటుతున్నా తీరడం లేదు. వాళ్లను రిలీవ్​ చేసేందుకు ఏపీ సర్కారు ఆమోదం తెలుపుతూ లేఖ సైతం రాసింది. కానీ తెలంగాణ సర్కారు నుంచే ఎలాంటి స్పందన లేకపోవడంతో 699 మంది ఉద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి. విభజన ప్రాసెస్​లో తెలంగాణ ఉద్యోగుల్లో కొంతమందిని ఏపీకి కేటాయించారు. తమను తెలంగాణకే తీసుకోవాలంటూ వారంతా మొరపెట్టుకున్నారు. సచివాలయంలో నిరసనలూ చేశారు. దీంతో తెలంగాణ ఉద్యోగులకు అండగా ఉంటాం. ఏపీకి కేటాయించిన ప్రతి ఉద్యోగినీ సొంత రాష్ట్రానికి తీసుకొస్తామంటూ టీఆర్ఎస్ సర్కారు హామీ ఇచ్చింది. కానీ ఐదేండ్లు దాటినా.. ఆ హామీ నెరవేరలేదు. ఏపీకి వెళ్లిన తెలంగాణ ఉద్యోగులు మాత్రం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

సీఎం కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలే

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ స్థానికత ఉన్న 714 మంది థర్డ్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ ను ఏపీకి కేటాయించారు. వీరిలో ఏపీ సచివాలయానికి 176 మంది, వివిధ హెచ్ఓడీల కిందకు 538 మంది వెళ్లారు. అయితే, హైద్రాబాద్ లో ఏపీ కార్యాలయాలు ఉన్నన్ని రోజులు ఏ సమస్యా రాలేదు. కానీ ఏప్రిల్ 2015 నుంచి ఒక్కొక్క ఆఫీస్ అమరావతికి తరలి వెళ్లడంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి. తమను వెంటనే తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలంటూ సచివాలయంలో ఆందోళనలు చేశారు. అప్పటి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వారికి నచ్చజెప్పి, తప్పకుండా తెలంగాణకు తీసుకొస్తామని హామీ కూడా ఇచ్చారు. అప్పట్నించి బాధిత ఉద్యోగులు సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావును వేడుకుంటున్నారు. అయితే, దీనిపై ముఖ్యమంత్రి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని వారు చెప్తున్నారని ఉద్యోగులు అంటున్నారు.

సీఎంల భేటీ తర్వాత పరిష్కారం కాలే

రెండోసారి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ రెండు సార్లు భేటీ అయ్యారు. ఆ భేటీల్లో విభజన సమస్యల్లో ప్రధాన సమస్యగా ఉన్న ఉద్యోగుల పంపిణీపై కూడా చర్చించారు. అమరావతిలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న నాలుగో తరగతి ఉద్యోగుల విషయం కూడా చర్చకు వచ్చింది. ఇరువురు సీఎంల సమావేశం తరువాత సమస్య పరిష్కారం అవుతుందని భావించారు. కానీ ఆ విషయం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. తమను తెలంగాణకు బదిలీ చేయాలని, సాధ్యం కాకపోతే కనీసం డిప్యూటేషన్ అయినా ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు13 వేల థర్డ్, పోర్త్ క్లాస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థికశాఖ వర్గాలు చెపుతున్నాయి. అమరావతిలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణలో సర్దడం పెద్ద సమస్య కాదని చెపుతున్నారు. అయితే, ఇది రాజకీయపరమైన నిర్ణయమని, సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటే వెంటనే పరిష్కారం అవుతుందని అంటున్నారు.

నాలుగేండ్లలో 15 మంది మృతి

ఏపీలో వారానికి ఐదు రోజులు వర్కింగ్ డేస్ ఉండటంతో మొదట్లో చాలా మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ వీకెండ్ హైద్రాబాద్ కు వచ్చేవారు. తిరిగి సోమవారం ఉదయం అమరావతికి తిరుగు ప్రయాణమయ్యేవారు. ప్రతి వారం అప్ అండ్‌ డౌన్ చేయడానికి ఎక్కువ డబ్బులు కావడంతో ప్రస్తుతం అక్కడే ఉండిపోతున్నారు. దీంతో కుటుంబానికి దూరంగా ఉండటంతో కొందరు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. మరికొంత మంది ఉద్యోగులు ఒంటరి జీవితం మూలంగా మద్యానికి బానిసయ్యారు. గత నాలుగేండ్లలో 15 మంది ఉద్యోగులు చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మానసికంగా ఆందోళనలో ఉండేవారని, మద్యం అలవాటుతో కూడా కొందరి ఆరోగ్యం క్షీణించిందని చెప్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

తెలంగాణ సర్కారు రిక్వెస్ట్ చేస్తే వెంటనే రిలీవ్ చేస్తాం: ఏపీ

అమరావతిలో పనిచేస్తున్న థర్డ్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఏపీ ప్రభుత్వ చీఫ్​సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఈ నెల 8న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో  భాగంగా ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రానికి బదిలీ చేసుకునే వెసులుబాటు ఉందని ఆ లేఖలో గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ అధికారికంగా రిక్వెస్ట్​ పంపితే చాలు.. ఉద్యోగులను వెంటనే శాశ్వత ప్రాతిపదికన లేదా డిప్యూటేషన్ మీద పంపించేస్తామని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.