
మణిపూర్ లోని ఇంఫాల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులను స్వస్థలానికి రప్పించే ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మణిపూర్‌లో ఉన్న తెలుగు విద్యార్థులంతా తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులను లిస్ట్ ఔట్ చేసినట్లు చెప్పారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.
ఏపీ వారికోసం కంట్రోల్ రూం
విద్యార్థుల కోసం ఏపీ భవన్‌లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి ప్రత్యేక అధికారిగా మైఖేల్ అంఖమ్‌ను నియమించామన్నారు. మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ భవన్ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారన్నారు.
ప్రత్యేక విమానం ఏర్పాటు చేశాం
కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రితో మాట్లాడి విద్యార్థులను రాష్ట్రానికి రప్పించే ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్ కూడా పెట్టామని చెప్పారు. విద్యార్థుల వివరాలు నమోదు చేసుకుంటే వాళ్లని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. మణిపూర్‌లో ఉన్న ఏపీ విద్యార్థులు ఇప్పటి వరకు సుమారు 100 మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఇంకా 50 మంది వరకు ఉండచ్చని అంచనా వేస్తున్నామని చెప్పారు. అందుకే 150 మందికి సరిపడే ప్రత్యేక విమానం ఏర్పాటు చేశామని వెల్లడించారు.