తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వార దర్శనాలు నాలుగవ రోజు ( జనవరి 2) కొనసాగుతున్నాయి. ఇవ్వాల్టి ( జనవరి 2) నుంచి ఉచిత సర్వదర్శనానికి భక్తులను అనుమతించింది టీటీడీ . దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి 2026 జనవరి 2 వతేదీన 30 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
జనవరి 1 న స్వామివారిని 65,225 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,106 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం ( జనవరి 1) స్వామివారి హుండీ ఆదాయం 3.63 కోట్లు లభించినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లలో పాలు, తాగునీరు, అన్నప్రసాద వితరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ALSO READ : భక్తికే కాదు.. జీవితంలో కూడా తప్పక ఆచరించాల్సిన 9 సూత్రాలు..
భక్తులు తోపులాట లేకుండా క్యూలైన్ లో వేచి ఉండాలని టీటీడీ సూచించింది. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటి మౌలిక వసతులను నిరంతరంగా అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తులు టీటీడీ సూచనలను పాటిస్తూ సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు..
