
జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుకు ఎంపికైన వారిలో 700 మందికి ప్రభుత్వం ఇంకా పోస్టింగ్స్ ఇవ్వలేదు. అధికారులు ‘నాన్ లోకల్’పై క్లారిటీ లేకుండా అప్లికేషన్స్ తీసుకున్నారని, ఇప్పుడు తమను బలి చేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్థానికత విషయంలో తప్పుడు సమాచారమిచ్చారని, ఇంకొందరు వికలాంగులు కాకున్నా ఆ కాలమ్ ఫిల్ చేయడంతో ఇబ్బందులేర్పడ్డాయని అందుకే పోస్టింగ్స్ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే ఈ 700 మంది పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎస్ ఎస్కే జోషి, పీఆర్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్‌లను కలిసి విషయం చెప్పి సమస్య పరిష్కరించాలని కోరారు. కానీ ఇప్పటికీ ఏ కదలికా లేదు. దీంతో అభ్యర్థులంతా ‘చలో సెక్రటేరియట్’కు సిద్ధమవుతున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సరిగా జరగలేదని, టీచర్లతో ఎలా చేయిస్తారని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన జిల్లాను ప్రభుత్వం లోకల్‌గా గుర్తించింది. కానీ ప్రస్తుతం ఉంటున్న జిల్లాను ‘లోకల్’గా తీసుకోవాలని పోస్టింగ్ రాని వాళ్లు కోరుతున్నారు. మెరిట్ ఆధారంగా అర్హతను బట్టి ఉమ్మడి జిల్లాలోనైనా, ప్రస్తుతం ఉంటున్న జిల్లా, వివాహమైన మహిళ ఉంటున్న జిల్లా, అప్లికేషన్‌లో ‘లోకల్’అని క్లైయిమ్ చేసుకున్న జిల్లా.. ఇలా ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ తీసుకునే సమయంలోనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నింపిన వెంటనే లోకల్‌స్టేటస్‌ను బై డిఫాల్ట్‌గా పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అంటున్నారు