మా మద్దతుతోనే బీజేపీకి 8 సీట్లు, 14 శాతం ఓట్లు : మందకృష్ణ మాదిగ

మా మద్దతుతోనే బీజేపీకి 8 సీట్లు, 14 శాతం ఓట్లు  :  మందకృష్ణ మాదిగ

పద్మారావునగర్​, వెలుగు:  రాష్ట్రంలో పదేండ్లు సాగిన నియంత, అహంకార పాలకుడిని ఓడించినందుకు ఎమ్మార్పీఎస్ ​వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్శీగుట్టలోని ఎమ్మార్పీఎస్  జాతీయ ఆఫీసులో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్​ మద్దతుతోనే బీజేపీ8 సీట్లు గెలుచుకోగా..14 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు.  అన్నిపార్టీల ఓటు శాతం తగ్గితే కాంగ్రెస్, బీజేపీలది మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో  కొత్తగా ఏర్పాటు కాబోతున్న  కాంగ్రెస్​ ప్రభుత్వానికి కంగ్రాట్స్​ చెబుతూ, మంత్రి వర్గంలో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు  ప్రాధాన్యం కల్పించాలని కోరారు.

గత సర్కార్​ చేసిన తప్పిదాలు చేయొద్దని సూచించారు. నియంతృత్వంగా కాకుండా ప్రజాస్వామ్య పరిపాలన అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్​నేతలు అనుకూలంగా వ్యవహరించలేదని, సృష్టమైన హామీని ఇచ్చిన బీజేపీకి తాము బహిరంగ మద్దతు ఇచ్చామన్నారు. ప్రధాని మోదీ తన హామీని నిలుపుకుంటారని, కచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్​ రాష్ర్ట అధ్యక్షుడు గోవింద్​ నరేశ్​, నేతలు లక్ష్మణ్, సోమశేఖర్, కొమ్ము శేఖర్, విజయ్, మల్లికార్జున్​పాల్గొన్నారు.