
- మరో రెండు స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతున్న జేఎస్‌పీ
హైదరాబాద్, వెలుగు : బీజేపీ జనసేనల మధ్య పొత్తు కుదిరింది. సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీలు ఒక క్లారిటీకి వచ్చాయి. బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, జనసేన చీఫ్పవన్ కల్యాణ్, నాదేండ్ల మనోహర్‌తో భేటీ అయి సీట్ల షేరింగ్‌పై ఒక ఒప్పందానికి వచ్చారు. ఆదివారం బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, డా.లక్ష్మణ్ రెండు సార్లు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. జనసేన మొదట 30 సీట్లు ఆశించింది. చివరకు 8 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకారం తెలిపింది. మరో రెండు సీట్ల కోసం జనసేన పట్టుబట్టినా.. బీజేపీ నేతలు ఇంకా ఏమీ తేల్చలేదు. శేరిలింగంపల్లి స్థానాన్ని ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకోలేదు. ఈ స్థానం బీజేపీ అభ్యర్థులకే కేటాయించాలనే ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఆ సీటుపై వెనక్కు తగ్గేది లేదని బీజేపీ తేల్చి చెప్పంది. బీజేపీ అంగీకారం తెలిపిన 8 స్థానాల్లో ఇప్పటికే 7 స్థానాలను జనసేనకు ఖరారు చేసింది.
జనసేన పోటీ చేసే ఆరు స్థానాలు
జనసేనకు ఇచ్చే స్థానాలను బీజేపీ ఖరారు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూకట్‌పల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, వైరా, కొత్తగూడెం, కోదాడ, అశ్వరావుపేట , నాగర్ కర్నూల్ నియోజకవర్గాలు జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ ఓకే చెప్పంది. కాగా బీజేపీ ఒప్పుకున్న 8 సీట్లతో పాటు మరో రెండు సీట్లు కావాలని జనసేన అడుగుతోంది. వాటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో తాండూర్ సీట్లు ఉన్నాయి. శేరిలింగంపల్లి స్థానాన్ని కూడా ఇవ్వాలని జనసేన బీజేపీపై ఒత్తడి తెచ్చినా, అందుకు ఆ పార్టీ ఒప్పుకోలేదు. కొండా విశ్వేశ్వర రెడ్డి ఇటీవల ఆ స్థానం కోసం పార్టీకి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అందుకే బీజేపీ శేరిలింగంపల్లి స్థానాన్ని ఇవ్వలేదని తెలుస్తున్నది.
జనసేనలో చేరికలు
సినిమా, టీవీ నటులతో పాటు పలువురు వ్యాపారులు జనసేన పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ప్రముఖ నటుడు సాగర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వ్యాపారి లక్కినేని సురేందర్ రావు జనసేనలో చేరారు. అదే జిల్లాకు చెందిన ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగబాబుతో పాటు పలువురిని పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ బరిలోకి దిగుతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా నటుడు సాగర్ మాట్లాడారు. ప్రజల కోసం నిలబడే పార్టీ జనసేన అని అన్నారు. పవన్ నాయకత్వంలో ప్రజా పోరాటాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. పవన్ నాయకత్వంలో ముందుకెళ్తామని ప్రేమ్‌కుమార్, సురేందర్ రావు, ఉమాదేవీ ప్రకటించారు. పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షుడు బీ.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ నేతలు రామ్ తాళ్లూరి, రాధారం రాజలింగం తదితరులు పాల్గొన్నారు.