నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ముగిసిన నుమాయిష్ 46 రోజుల్లో 23.5 లక్షల సందర్శకులు

నాంపల్లి ఎగ్జిబిషన్  గ్రౌండ్స్ లో ముగిసిన నుమాయిష్ 46 రోజుల్లో 23.5 లక్షల సందర్శకులు

బషీర్‌బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్  గ్రౌండ్స్​లో నిర్వహించిన 85వ నుమాయిష్  ఆదివారంతో ముగిసింది. 46 రోజుల పాటు సాగిన నుమాయిష్‌ను 23.50 లక్షల మందికి పైగా సందర్శించారు. చివరి రోజున లక్ష మంది వరకు వచ్చారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 3 లక్షల మందికి పైగా అదనంగా వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్.సుఖేష్ రెడ్డి, కార్యదర్శి బీఎన్  రాజేశ్వర్  తెలిపారు. సుమారు 1,100 స్టాల్స్‌తో నిర్వహించిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు నగరంతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ స్టాల్స్  ద్వారా సంక్షేమ పథకాలను ప్రచారం చేశాయి. ఫుడ్ కోర్టులు, అమ్యూజ్‌మెంట్  పార్క్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నుమాయిష్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సొసైటీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.