దేవరగట్టు కొట్లాటలో 9 మందికి సీరియస్

దేవరగట్టు కొట్లాటలో 9 మందికి సీరియస్

కర్నూల్ జిల్లాలోని దేవరగట్టు కర్రల సమరంలో జరిగిన హింసలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిని ఆలూరు, ఆధోని, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. మాళమల్లేశ్వరస్వామి విగ్రహాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. రింగులు తొడిగిన కర్రలతో భక్తులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో వంద మందికి పైగా భక్తులకు గాయాలు అయ్యాయి.

దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై నిర్వహించే మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. 

దేవరగట్టులో బన్ని ఉత్సవాన్ని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఏడుగురు డీఎస్పీలు, 23మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 164 మంది ఏఎస్సైలు, 322 మంది కానిస్టేబుళ్లు, 50 మంది ప్రత్యేక పోలీసులు, మూడు ప్లాటూన్ల ఆర్మ్‎డ్ రిజర్వ్ సిబ్బందిని కేటాయించారు. ఉత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో నిఘా పెట్టారు. కొండపైకి వాహనాల రాకపోకలు నిషేదించారు.