పెన్షన్ తెచ్చుకోనీకిపోతె.. 92 మందికి కరోనా

పెన్షన్ తెచ్చుకోనీకిపోతె.. 92 మందికి కరోనా

వనపర్తి జిల్లా పెద్దదగడలో 102మందికి పాజిటివ్‌
కంటైన్మెంట్ జోన్‌‌‌‌‌‌‌‌గా మారిన గ్రామం

వనపర్తి, వెలుగు: పెన్షన్ తెచ్చుకునేందుకు పోయిన వృద్దులు, వికలాంగులకు కరోనా సోకింది. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా 92 మంది వైరస్ బారిన పడ్డారు. 1,400 మంది జనాభా ఉన్న గ్రామంలో.. 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఊరు ఊరంతా కంటెయిన్ మెంట్ జోన్ గా మారిపోయింది. ఇప్పుడు వైరస్ బారిన పడిన వారి వల్ల కుటుంబసభ్యులు ఎఫెక్ట్ అవుతారేమోనన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ.. ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది.

పెన్షన్ పంపిణీచేసిన వ్యక్తికి వైరస్
ఈ నెల మొదటి వారంలో వృద్ధులు, వికలాంగులకు పోస్టాఫీస్‌కు చెందిన ఉద్యోగి పెన్షన్ పంపిణీ చేశారు. ఆ సమయంలో అందరూ లైన్‌లో నిల్చోవటంతో వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. ఈ మధ్య ఉద్యోగికి కరోనాపాజిటివ్ వచ్చింది. అయితే ఉద్యోగి వల్ల వృద్ధులకు వైరస్ వచ్చిందా.. వీరినుండి ఉద్యోగికి సోకిందా అనేది తెలియటం లేదు. 20న కరోనా లక్షణాలు చాలామందిలో కనిపించడంతో వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిపరీక్షలు చేయించుకున్నారు. దీంతో గ్రామంలో కరోనా కేసుల సంఖ్య 102కి చేరింది.

ఇండ్లల్లోనే ఉంచి ట్రీట్మెంట్
గ్రామంలో 100 మందికిపైగా కరోనా బారిన పడటంతో అధికారులు సీరియస్ గా స్పందించారు. అందరినీ ఇండ్లలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. జిల్లాయంత్రాంగం మంగళవారం గ్రామంలో ప్రత్యేక క్యాంప్ నిర్వహించింది. గ్రామాన్ని కంటెయిన్ మెంట్ జోన్ గా ప్రకటించి రాకపోకలపై ఆంక్షలు
విధించింది. జిల్లావైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెన్షన్ పంపిణీ సమయంలోనే కరోనా వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఎవరి పరిస్థితి ప్రమాదకరంగా లేదని, ఒకవేళ సీరియస్ అయితే మహబూబ్ నగర్ లోని ఐసోలేషన్ సెంటర్ కు తరలిస్తామని చెప్పారు.

గ్రామాల్లో కనిపించని సోషల్ డిస్టెన్స్
కరోనావ్యాప్తి గ్రామాల్లో రోజురోజుకు పెరుగుతున్నా రేషన్ దుకాణాలు, పెన్షన్ పంపిణీ కేంద్రాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది.

పెండ్లికొడుకుతో పాటు 22మందికి కరోనా
లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని మహాలక్ష్మివాడలో మూడు రోజుల్లో 22 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వారం రోజుల కిందట నిర్వహించిన పెండ్లి.. వైరస్ వ్యాప్తికి కారణమైంది. గుల్లకోట గ్రామానికి చెందిన అబ్బాయికి మహాలక్ష్మివాడకు చెందిన అమ్మాయికి ఈనెల 13న పెండ్లి జరిగింది. తర్వాత ఒక్కొక్కరిగా వైరస్ బారిన పడ్డారు. కరోనాసోకిన వారిలో పెండ్లికొడుకు కూడా ఉన్నాడు. మూడు రోజుల నుంచి జరుగుతున్న టెస్టుల్లో ఒక్కొక్కటిగా కేసులు బయటపడుతున్నాయి. వైరస్ బారినపడ్డ వాళ్లందరూ కూలీలే. ప్రస్తుతం వారందరినీ హోం క్వారంటైన్ చేశారు.

For More News..

ఆర్టీసీ ఉద్యోగులకు ఫ్రీగా కరోనా కిట్లు

దేశంలో తొలి సోలార్‌‌రూఫ్‌కు పేటెంట్

ఒకే వ్యక్తికి మూడు నెలల్లో రెండోసారి కరోనా