- ఫలితాలు విడుదల చేసిన టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా రెండో ఏడాది ప్రవేశాలకు నిర్వహించిన టీజీఈసెట్-ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో శుక్రవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఈసెట్‌లో 93.60 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్టు ప్రకటించారు. మొత్తం 17,870 మంది అభ్యర్థులకుగానూ 16,726 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
ఈసారి పాస్పర్సంటేజీలో అమ్మాయిలదే పైచేయి. పరీక్షకు హాజరైన వారిలో 95.02 శాతం మంది అమ్మాయిలు క్వాలిఫై అవ్వగా, అబ్బాయిలు 92.67 శాతం మంది అర్హత సాధించారు. సీఎస్ఈ బ్రాంచీలో అత్యధికంగా 5,770 మంది రిజిస్టర్ చేసుకోగా.. 5,552 మంది (96.22%) క్వాలిఫై అయ్యారు. ఈసీఈలో 4,521 మందికి గానూ 4,225 మంది, ఈఈఈలో 3,471 మందికి 3,006 మంది, సివిల్ లో 1,980 మందికి 1,883 మంది, మెకానికల్ ఇంజినీరింగ్ లో 1,562 మందికి 1,524 మంది అర్హత సాధించారు. ఎస్సీఎస్టీలు వందశాతం క్వాలిఫై కాగా, ఓసీలు 93.17%, బీసీ సీలో 94.19%, బీసీ బీలో 92.44 %, బీసీడీలో 90.13 మంది క్వాలిఫై అయ్యారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
జూన్ ఫస్ట్ వీక్లో అడ్మిషన్ షెడ్యూల్..
జూన్ మొదటి వారంలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. జులై రెండో వారం నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. గతేడాది ఉన్న ఫీజుల విధానమే ప్రస్తుతం కొనసాగిస్తామన్నారు. గతేడాది 179 కాలేజీల్లో 21,200 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఈ ఏడాది కూడా అవే సీట్లు ఉండే అవకాశం ఉందన్నారు. కౌన్సిల్ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
