ఉపాధిలో ఈ-కేవైసీ 93.76 శాతం పూర్తి..తెలంగాణలో వేగంగా ఆధార్ ఆధారిత చెల్లింపుల ప్రక్రియ 

ఉపాధిలో ఈ-కేవైసీ 93.76 శాతం పూర్తి..తెలంగాణలో వేగంగా ఆధార్ ఆధారిత చెల్లింపుల ప్రక్రియ 
  • తుది దశకు ఈకేవైసీ ధ్రువీకరణ..
  • రాష్ట్రవ్యాప్తంగా 50,01,598 మంది యాక్టివ్ ఉపాధి కూలీలు 
  • 49,99,694 మంది ఆధార్ వివరాలు పోర్టల్‌‌‌‌లో నిక్షిప్తం
  • జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలని టార్గెట్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఉపాధి హామీ స్కీమ్‌‌‌‌లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ‘ఆధార్‌‌‌‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏబీపీఎస్)’ప్రవేశపెట్టింది. కూలీల వేతనం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పడేలా రాష్ట్రంలో ఈ కేవైసీకి శ్రీకారం చుట్టింది.

ఈ ప్రక్రియ రాష్ట్రంలో తుదిదశకు చేరుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 64.83 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. సుమారు 1.01 కోట్ల మంది కూలీలు ఉన్నారు. ఇందులో ప్రస్తుతం 50,01,598 మంది యాక్టివ్ కూలీలు ఉండగా.. వారిలో 49,99,694 మంది ఆధార్ వివరాలను ఇప్పటికే పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశారు. యాక్టివ్ కూలీలలో దాదాపు 93.76 శాతం మందికి ఈ-కేవైసీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది.

-ఈ కేవైసీలో టెక్నికల్‌‌‌‌ సమస్యలు.. 

రాష్ట్రవ్యాప్తంగా ఇకపై వేతనాల చెల్లింపులు ఏబీపీఎస్‌‌‌‌ ద్వారానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 49,99,694 మంది కూలీలు నేరుగా తమ ఖాతాల్లో వేతనాలు పొందేందుకు అర్హత సాధించారు. అయితే, ఈ కేవైసీకి కొన్నిచోట్ల టెక్నికల్‌‌‌‌ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఆధార్ కార్డులో ఒక విధంగా, జాబ్ కార్డులో మరో విధంగా పేర్లు ఉండటంతో 468 మంది కూలీల ధ్రువీకరణ నిలిచిపోయింది.

ఉపాధి పనుల వల్ల కూలీల చేతివేళ్లు అరిగిపోయి, బయోమెట్రిక్ యంత్రాలపై ముద్రలు పడటం లేదని, దీంతో అథెంటికేషన్ ఫెయిల్ అవుతోందని ఫీల్డ్ అసిస్టెంట్లు పేర్కొంటున్నారు. మరో 206 మంది వివరాలను ఇంకా ఉన్నతాధికారుల ధ్రువీకరణ కోసం పంపాల్సి ఉంది. కొంతమంది కూలీలు పట్టణాలకు వలస వెళ్లడంతో వారికి ఈ-కేవైసీ చేయడం కష్టంగా మారిందని చెప్తున్నారు.

ఒకేసారి లక్షలాది మంది డేటాను అప్‌‌‌‌లోడ్ చేస్తుండటంతో సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయని వాపోతున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా కేవైసీ పూర్తి చేయాలని కూలీలు కోరుతున్నారు. మరోవైపు, జూన్ నెలాఖరు నాటికి ఈ కేవైసీ వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆఫీసర్లు డెడ్ లైన్ విధించారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది నేరుగా కూలీల ఇండ్లకే వెళ్లి ఆధార్ అప్‌‌‌‌డేట్లు, ఈ-కేవైసీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రక్రియలో మరింత వేగం పెరిగింది.