సరస్వతీ దేవిపై వ్యాఖ్యలకు నిరసనగా బాసరలో బంద్

సరస్వతీ దేవిపై వ్యాఖ్యలకు నిరసనగా బాసరలో బంద్

భైంసా, వెలుగు: సరస్వతీ దేవిపై రెంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్​ జిల్లా బాసర లో బంద్​ నిర్వహించారు. వ్యాపార సంఘాలు, స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, సిబ్బంది ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నిత్య పూజలను నిలిపివేశారు. తర్వాత అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానికులు, వ్యాపారస్తులు నిజామాబాద్–​-భైంసా రోడ్డుపై ఉన్న శివాజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.

రెండు గంటలకు పైగా ధర్నా చేయడంతో ట్రాఫిక్​ స్తంభించింది. కలెక్టర్​, ఎస్పీ రావాలని..రాజేశ్​ను 24 గంటల్లో అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. రాజేశ్​పై పీడీ యాక్టు పెట్టాలని డిమాండ్​చేశారు. ముథోల్​సీఐ వినోద్​ రెడ్డి, ఎస్సై మహేశ్​వచ్చి ఆందోళనకారులను సముదాయించి నిరసన విరమింపజేశారు. రాజేశ్​పై బాసర పీఎస్​లో ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 153, 504 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.