
ఇతరులు అన్యాక్రాంతం చేస్తున్న తన భూమి తనకు ఇప్పించాలని డిమాండ్
ఖమ్మం: ఇతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్న తన భూమిని తనకు ఇప్పించాలంటూ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం (మ)జమాలపురం లో కోటేశ్వరరావు అనే రైతు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని… అందుకే గత్యంతరం లేక సెల్ టవర్ ఎక్కి నిరసన చేస్తున్నానని బిగ్గరగా కేకలు వేయడం గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు సెల్ టవర్ వద్దకు వచ్చి వివరాలు ఆరా తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సెల్ టవర్ ఎక్కి నినాదాలు చేస్తున్న చండ్రుగొండ చెందిన బెల్లంకొండ కోటేశ్వరరావు తో పోలీసులు పలుమార్లు మంతనాలు జరిపారు. సమస్య ఏమిటని అడిగితే.. జమలాపురం లో తనకు కొంత భూమి ఉందని… తన నివాసం వేరే చోట ఉండటం తో భూమి కి ఇరువైపులా ఉన్నవారు తమ భూమి ని అక్రమించుకున్నారని వాపోయాడు. తన భూమిని కొలతలు వేసి తమకు అప్పగించాలని ఎర్రుపాలెం రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో విసుగు చెందిపోయానని చెప్పాడు. ఏం చేయాలో తెలియక ఈ రోజు జమాలపురం వచ్చి సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టానని తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలం నుండే రెవెన్యూ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. న్యాయం చేయిస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు సెల్ టవర్ దిగి వచ్చి నిరసన విరమించాడు.