తండ్రి తన కొడుకును మందలించొచ్చు: శ్రీని కామెంట్స్ పై రైనా

తండ్రి తన కొడుకును మందలించొచ్చు: శ్రీని కామెంట్స్ పై రైనా

న్యూఢిల్లీ: ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన టీమిండియా మాజీ లెఫ్టాండర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేష్ రైనా ఆకస్మికంగా ఇండియా తిరిగొచ్చాడు. రైనా నిష్క్రమణపై పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. రైనా వెళ్లిపోవడంపై సీఎస్కే యజమాని ఎన్. శ్రీనివాసన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదానికి రైనా ఫుల్ స్టాప్ పెట్టాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఇండియాకు తిరిగొచ్చానన్నాడు. శ్రీనివాసన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తండ్రి తన కొడుకును మందలించడంలో తప్పు లేదన్నాడు. శ్రీని కామెంట్స్ ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నాడు.

‘ఆయన (శ్రీనివాసన్) నాకు తండ్రి లాంటి వాడు. ఆయన ఎల్లప్పుడూ నాకు అండగా నిలబడ్డారు. నా హృదయానికి దగ్గరగా ఉంటారు. ఆయన నన్ను తన చిన్న కొడుకుగా చూస్తారు. ఆయన మాట్లాడిన విషయాలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నాపై కామెంట్స్ చేసిన సమయంలో నేను తిరిగి రావడానికి గల కారణాలు ఆయనకు తెలియవు. ఇప్పుడు ఆ విషయాలు ఆయనకు చెప్పాం. తర్వాత ఆయన నాకు మెసేజ్ చేశారు. దీని గురించి మేం చాట్ చేశాం. ఈ విషయాల నుంచి నేను బయట పడాలనుకుంటున్నా. నేను నా కుటుంబం కోసమే తిరిగొచ్చా. సీఎస్కే కూడా నా ఫ్యామిలీ లాంటిదే. ధోనీ భాయ్ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. నాకు సీఎస్కేకు మధ్య ఎలాంటి వివాదం లేదు’ అని రైనా పేర్కొన్నాడు.