IPL 2024 Final: హైదరాబాద్‌ ఘోర ఓటమి.. ఐపీఎల్ 17వ సీజన్ విజేత కోల్‌క‌తా

IPL 2024 Final:  హైదరాబాద్‌ ఘోర ఓటమి.. ఐపీఎల్ 17వ సీజన్ విజేత కోల్‌క‌తా

ఐపీఎల్ పదిహేడో సీజన్ విశ్వ విజేతగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ అవతరించింది. ఆదివారం(మే 26) చెపాక్ వేదికగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జరిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఇప్పటికే రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన షారుఖ్ ఖాన్ జట్టు. మూడో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది.  

అంతటా ఏకపక్షం

హోరాహోరీగా సాగాల్సిన ఫైనల్ పోరు చప్పగా ముగిసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. తొలుత కోల్‌కతా బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్‌ బ్యాటర్లు స్వల్ప స్కోరుకే చేతులెత్తేశారు.18.3 ఓవర్లలో సన్‌రైజర్స్ 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు. పాట్ కమిన్స్‌ (24) టాప్‌ స్కోరర్‌. అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0), త్రిపాఠి (9), మార్క్రమ్(20), నితీష్ రెడ్డి(13), షాబాజ్ అహ్మద్(8), అబ్దుల్ సమద్(4), క్లాసెన్(16) అందరూ విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 3, స్టార్క్ 2, హర్షిత్ రాణా 2, వైభవ్ అరోరా, నరైన్, వరుణ్‌ చక్రవర్తి తలో వికెట్ తీశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10.3 ఓవర్లలోనే చేధించింది. సునీల్ న‌రైన్(6) త్వరగా ఔటైనా.. ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్(39), వెంక‌టేశ్ అయ్యర్(52 నాటౌట్; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) జోడి వీరవిహారం చేశారు. వీరిద్దరూ హైద‌రాబాద్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. అయితే, విజయానికి 12 పరుగులు కావాల్సిన సమయంలో గుర్బాజ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన అయ్యర్(4) పరుగులు చేశాడు.

కంటతడి పెట్టిన కావ్య మారన్

మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమి బాధతో హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ కంటతడి పెట్టుకుంది. ఆ దృశ్యాలు తెలుగు అభిమానులను బాధించాయి. విజేతగా నిలిచిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ ట్రోఫీతో పాటు రూ. 20 కోట్లు ఎగరేసుకుపోగా.. రన్నరప్‌తో సరిపెట్టుకున్న  స‌న్‌రైజ‌ర్స్‌కు రూ. 13 కోట్లు ముట్టాయి.