ఖతార్‌ విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు

 ఖతార్‌ విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు

రోడ్డు సరిగా లేక గుంతలు గుంతలుగా ఉంటే అటుగా వెళ్లే వాహనాలు... కుదుపులకు గురయి చాలామందికి కూసాలు కదిలిపోయే ఘటనలు చూశాం.. ఇప్పుడు అలాంటి ఘటనలే విమాన ప్రయాణంలో కూడా చోటు చేసుకుంటున్నాయి. మొన్న సింగపూర్​ ఎయిర్​ లైన్స్​ విమానం కుదుపులకు గురి కాగా.. తాజాగా ఇప్పుడు ఖతార్​ విమానంలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే....

ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం భారీ కుదుపులకు గురైంది. (Turbulence in Qatar Airways) ఈ సంఘటనలో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో సహా 12 మంది గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందించారు. ఆదివారం ( మే 26) మధ్యాహ్నం ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యూఆర్‌017 విమానం ఆ దేశ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌కు బయలుదేరింది. అయితే టర్కీ గగనతలంపై ఎగురుతుండగా ఆ విమానం భారీ కుదుపులకు గురైంది. ఈ సంఘటనలో ఆరుగురు సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులతో సహా 12 మంది గాయపడ్డారు.

టర్కీ మీదుగా విమానం ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుగా విమానంలో టర్బులెన్స్‌కి గురైంది. ఆరుగురు ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బంది గాయపడ్డారని డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ వర్గాలు ధృవీకరించాయి. “దోహా నుండి ఖతార్ ఎయిర్‌వేస్ విమానం QR017 ఆదివారం 13.00 గంటల ముందు డబ్లిన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ తర్వాత, ఎయిర్ పోర్టు పోలీస్ రెస్క్యూ సిబ్బంది గాయపడిన 12 మందికి అత్యవసర సేవల్ని అందించింది. టర్కీ మీదుగా వెళ్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు గురైంది అని ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఆ విమానం డబ్లిన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కాగానే అత్యవసర సేవలు అందించినట్లు ఆ విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఫైర్, రెస్క్యూ సిబ్బంది ఆ విమానం వద్దకు చేరుకున్నారని చెప్పారు. విమానంలో భారీ కుదుపుల వల్ల గాయపడిన 12 మందికి చికిత్స అందించినట్లు వివరించారు. అలాగే ఆ విమానంలో ప్రయాణించిన వారందరికీ పూర్తి సహాయ సహకారాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.