జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది: యూఐడీఏఐ

జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది: యూఐడీఏఐ

జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)  ఖండించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్‌డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. గడువు తర్వాత అప్‌డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్‌డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పని చేయకపోవడం అనేది ఉండదని స్పష్టం చేసింది. 

కాబట్టి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని సూచించారు.  మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి, మీరు యూఐడీఏఐ  వెబ్‌సైట్ లేదా ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు.   యూఐడీఏఐ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఎటువంటి ఛార్జీలు లేనప్పటికీ, ఆధార్ సెంటర్‌లో దాన్ని అప్‌డేట్ చేయడానికి మీకు రూ. 50 ఖర్చు అవుతుంది.

అప్‌డేట్‌ చేసుకోండిలా..

* https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ కావాలి. 
*  ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు ‘ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ అడ్రస్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
* ఇందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు ఆప్‌లోడ్‌ చేయాలి
* అనంతరం చిరునామా నిరూపించేలా మరో ప్రతాన్ని అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ చేయాలి
* రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత ‘డాక్యుమెంట్‌ అప్‌డేట్‌’పై క్లిక్‌ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి.
* తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ నుంచి ‘ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌’ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. 
* ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి. 
* 14 అంకెల ‘అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌’ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు.
* ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌ను సంప్రదించవచ్చు.

మీరు ఉచితంగా అప్‌డేట్ చేయగల వివరాలు

  • పేరు
  • చిరునామా
  • పుట్టిన తేదీ/వయస్సు
  • లింగం
  • మొబైల్ నంబర్
  • ఇమెయిల్ చిరునామా
  • రిలేషన్ షిప్ స్టేటస్