IPL 2024 Final: కోల్‌కతా బౌలర్ల విజృంభణ.. 113 పరుగులకు హైదరాబాద్ అలౌట్

IPL 2024 Final: కోల్‌కతా బౌలర్ల విజృంభణ.. 113 పరుగులకు హైదరాబాద్ అలౌట్

ఐపీఎల్ ఫైనల్ పోరు చప్పగా సాగుతోంది. లీగ్ దశలో పరుగుల వరద పారించిన హైదరాబాద్ వీరులు ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ ప్రత్యర్థి జట్టు ముందు బంతికో పరుగు చొప్పున కూడా నిర్ధేశించలేకపోయింది. 18.3 ఓవర్లలో 113 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. వరుణుడు కరుణిస్తే తప్ప ఆరంజ్ ఆర్మీ ఓటమిని తప్పించుకునే పరిస్థితి లేదు.

బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ను స్టార్క్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. కళ్లు చెదిరే బంతితో అభిషేక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 2 పరుగులకే సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా వేసిన ఆ మరుసటి ఓవర్‌లోట్రావిస్ హెడ్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ సమయంలో ఆదుకోవాల్సిన రాహుల్ త్రిపాఠి (9) కూడా వారి వెంటే అడుగులు వేశాడు. స్టార్క్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతికి రమణ్‌దీప్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

అంపైర్లకు చేతులు నొప్పెట్టేలా ఆట..

ఈ ముగ్గురనే కాదు.. వీరి అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాటరూ కోల్‌కతా బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేకపోయాడు. ఔట్.. ఔట్.. ఔట్.. అని వెంటవెంటనే చేతులెత్తి అంపైర్లకు చేతులు నొప్పెట్టాయి. అలా మన బ్యాటర్ల ప్రదర్శన సాగింది. ఐడెన్ మార్క్రామ్(20), నితీష్ రెడ్డి(13), షాబాజ్ అహ్మద్(8), అబ్దుల్ సమద్(4), హెన్రిచ్ క్లాసెన్(16) పరుగులు చేశారు. బ్యాటర్లతో పోలిస్తే ఆరంజ్ ఆర్మీ కెప్టెన్ కమిన్స్(24) కాస్త నయం. విలువైన పరుగులు చేసి జట్టు స్కోరు వంద పరుగులు దాటేందుకు సాయపడ్డాడు.

కోల్‌కతా బౌలర్లలో అందరూ రాణించారు. రస్సెల్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హర్షిత్ రాణా 2 వికెట్లు చొప్పున.. నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి వికెట్ చొప్పున తీసుకున్నారు.