ఉమ్మడి వరంగల్లో హైవే పనులు వెరీ స్పీడ్​

ఉమ్మడి వరంగల్లో హైవే పనులు వెరీ స్పీడ్​
  •     జిల్లాలో 13 కిలోమీటర్ల మేర ఎన్​హెచ్​930పీ నిర్మాణం పూర్తి
  •     జిల్లా నుంచి హైదరాబాద్​కు మరింత తగ్గనున్న దూరం

మహబూబాబాద్, వెలుగు: జాతీయ రహదారుల విస్తీర్ణం పెరుగుతోంది. ఇక రవాణా సౌకర్యం హాయిగా సాగనుంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో నేషనల్​హైవేల సంఖ్య పెరుగుతుండడంతో రవాణా మరింత సాఫీగా జరుగనుంది. నూతనంగా ఏర్పాటు కానున్న ఎన్​హెచ్​930పీ నిర్మాణ పనులు జిల్లా పరిధిలో 13 కీ.మీ పూర్తికాగా, ఇప్పటికే వలిగొండ నుంచి జిల్లాలోని పెద్దవంగర వరకు రోడ్డు విస్తరణ పనులు వేగవంతమయ్యాయి.  

ఎన్​హెచ్​930పీతో మరింత సౌకర్యం..

నూతన ఎన్ హెచ్ 930 పీ (ఘట్​కేసర్, ఈ దులాబాద్​) రోడ్డు వయా వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్​, ఇల్లంద మీదుగా భద్రాద్రి కొత్తగూడెం వరకు మొత్తం 234 కిలో మీటర్ల రోడ్డు నిర్మిస్తున్నారు. మహబూబాబాద్​జిల్లాలో 65  కిలో మీటర్లు వరకు నిర్మించనున్నారు. వలిగొండ నుంచి తిరుమలగిరి ద్వారా మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కొరిపెల్లి, వడ్డె కొత్తపల్లి, పెద్దవంగర వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు 13 కిలోమీటర్ల వరకు చేరకున్నాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో తొర్రూరు నుంచి మహబూబాబాద్ వరకు రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే భద్రాచలం, హైదరబాద్​కు 50 కి.మీ మేర దూరం తగ్గనుంది. 

భూ సేకరణలో  తీవ్ర జాప్యం..

తొర్రూరు మండల పరిధిలోని దస్రు తండా నుంచి నెల్లికుదురు మండల పరిధిలోని వావిలాల వరకు ఎన్ హెచ్​ 930పీ రోడ్డు నిర్మాణానికి రైతుల నుంచి భూ సేకరణకు మార్చి 26న బహిరంగ ప్రకటన, రైతులకు నోటీసులు జారీ చేశారు. భూ రికార్డులు సరిగ్గా అప్​డేట్ కాకపోవడంతో ఫీల్డ్ లో ఉన్న రైతుల భూములకు పరిహారం కోసం సరిగ్గా నివేదికలు తయారు చేయకపోవడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో జీపీఎస్ సర్వే వివరాలు మళ్లీ పరిశీలన చేస్తున్నారు. న్యూ నోటీసులను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పరిహారం పెంపు కోసం రైతులు కోర్టును ఆశ్రయిస్తున్నారు.

జిల్లాలో పెరుగుతున్న హైవేల విస్తీర్ణం..

మహబూబాబాద్ జిల్లా పరిధిలో నేషనల్ హైవేల పరిధి పెరుగుతోంది. ఇప్పటికే మరిపెడ, మహబూబాబాద్​ కు ఎన్ హెచ్​365, మరిపెడ, తొర్రూరు ఎన్​హెచ్ 565 ఉన్నాయి. నూతనంగా నాగ్​పూర్ నుంచి విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే భూ సేకరణ పనులు ప్రారంభించనుండగా, ఊరుగొండ నుంచి మహబూబాబాద్ జిల్లా ద్వారా ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం వరకు 108.23 కిలోమీటర్ల హైవే పనులు చేపట్టాల్సి ఉంది. ఎన్ హెచ్ 930పీ రోడ్డు పనులు పూర్తి కావలసి ఉంది.  

రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలి

భద్రాచలం నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రం ద్వారా నెల్లికుదురు, తొర్రూరు, వలిగొండ నుంచి ఘట్​కేసర్ ఎన్ హెచ్–930 పీ రోడ్డు నిర్మాణ పనులను స్పీడప్ చేయాలి. అధికారులు స్పందించి భూ సేకరణ సమస్యలను పరిష్కరించి రోడ్డు పనులు త్వరితగిన జరిగేలా చర్యలను చేపట్టాలి.
- సుధాకరాచారి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తొర్రూరు